కామారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. సోమవారం ఆయన కామారెడ్డి పట్టణంలో సుమారు రూ.28 కోట్లతో స్వాగత తోరణం, ఆరు వరుసల రోడ్డు, సెంట్రల్ లైటింగ్, మీడియన్ పనులను ప్రారంభించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ చౌరస్తా వద్ద విలేకరులతో మాట్లాడారు. సౌమ్యుడైన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు.
నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారడం, కలెక్టర్, ఎస్పీలు రావడం, భారీగా భవనాలను నిర్మించడం, మెడికల్ కళాశాల మంజూరు కావడం, ఆరు వరుసల రోడ్డు నిర్మాణం తదితర పనులు గంప గోవర్ధన్ చేపట్టారని ప్రశంసించారు. నియోజకవర్గంలో పలు బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరగా, ఈ రోజే ఆ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కోరిక మేరకు కామారెడ్డి పట్టణంలో అంతర్గత రోడ్లు, స్టేడియంలో మార్పులు చేర్పులు, మున్సిపల్ నిధుల కోసం మరో రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.28 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించగా, మరో 45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉర్దూ అకాడమి చైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ జితేశ్ వీపాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
కేటీఆర్ పర్యటన సందర్భగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నేషనల్ హైవే 44 నుంచి పట్టణంలో పర్యటించే ప్రాంతాల వరకు మొత్తం అడుగడుగునా పోలీసులు మొహరించారు. ప్రత్యేక బలగాలు రోడ్డు వెంట పర్యవేక్షించారు.