నిజామాబాద్, ఆగస్టు 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వినాయక చవితి పర్వదినాన కామారెడ్డి జిల్లా గతంలో ఎన్నడూ లేని జల విధ్వంసానికి గురైంది. అత్యంత భారీ వానలతో కామారెడ్డి అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లోనే అతి భారీ వర్షాపాతం కామారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో ఏక కాలంలోనే నమోదైంది. రాజంపేట మండలం ఆరుగొండలో 24గంటల్లో 43.15సెం.మీటర్లు వర్షాపాతం నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది.
బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు లెక్కలు తీస్తే ఆరుగొండలో 50 సెంటీ మీటర్లకు పైగానే వర్షాపాతం నమోదైందని అధికార యంత్రాంగం చెబుతోంది. ఏకధాటి వాన, ఎగువ నుంచి వాగులు, వంకలు, పొలాలు తేడా లేకుండా తన్నుకు వచ్చిన వరదతో కామారెడ్డి జలమయమైంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీ, జీఆర్ కాలనీ, ఈఎస్ఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాలైతే పూర్తిగా మునకేశాయి.
ఇళ్లలోకి చేరిన వరదతో చిక్కుకున్న వారిని పోలీసులు ప్రాణాలు తెగించి రక్షించారు. ఇక నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద 8 మంది బిహార్ కూలీలు చిక్కుకోగా బుధవారం రాత్రంతా శ్రమించి వారిని రక్షించారు. బుధవారం మొదలైన జల విలయం గురువారం కూడా పలు చోట్ల కొనసాగింది. వర్షం తెరిపినివ్వడంతో భారీ పెను ముప్పు నుంచి కామారెడ్డి జిల్లా బయట పడింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో శుక్ర, శనివారాలు సైతం కామారెడ్డి కలెక్టర్ సెలవులు పొడిగించారు.
ప్రాణాలు తెగించి కాపాడిన పోలీసులు…
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జల విపత్తులో చిక్కుకున్న వారిని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రాణాలు తెగించి కాపాడారు. జిల్లా వ్యాప్తంగా 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతిలో బోటు కూడా పయనించలేని స్థితిలో హెలికాప్టర్ అవసరమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా హెలికాప్టర్ అందుబాటులోకి రాలేదు. మంజీరాలో ప్రవాహం పెరగడం వల్ల జుక్కల్ నియోజకవర్గంలో డోంగ్లి, మద్నూర్, పిట్లం మండలాల్లో పలు గ్రామస్థులు ఇబ్బందులకు గురయ్యారు.
వరద ముప్పును అంచనా వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. వరద ముంచెత్తుతుండటంతో డోంగ్లి మండలంలోని సిర్పూర్, హాసన్టాక్లి, పెద్ద టాక్లి గ్రామల్లోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మహారాష్ట్రకు సరిహద్దులోని సలాబత్పూర్ ఆంజనేయశ్వామి ఆలయంలో మరికొందరు వసతి పొందారు. పెద్ద టాక్లీలో కొన్ని కుటుంబాలు డోంగ్లి మండల కేంద్రానికి వెళ్లి తలదాచుకున్నాయి. పిట్లం మండలం కుర్తి గ్రామం పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకుంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 22 పంచాయతీ రోడ్లు ధ్వంసం అయ్యాయి. 39 మార్గాల్లో ఆర్ అండ్ బి రోడ్లు కనెక్షన్ కోల్పోయినట్లుగా ఇంజనీర్లు చెప్పారు. ఈ నష్టం మరింత పెరిగే వీలుంది.
తెగిన ఎన్హెచ్ 44, రైల్వే ట్రాక్…
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వరపల్లి గ్రామ శివారులో భిక్కనూర్ – తలమడ్ల రైల్వే స్టేషన్ మధ్య వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకు పోయింది. ఫలితంగా పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు. పునరుద్ధరణ చర్యలను సౌత్ సెంట్రల్ రైల్వే షురూ చేసినప్పటికీ వరద ప్రవాహం ఆగిన తర్వాతనే ట్రా క్పై రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. జాతీయ రహదారి 44 సైతం వరద ధాటికి ధ్వంసమైంది.
భిక్కనూర్ మండలం క్యాసంపల్లి – జంగంపల్లి శివారులో భారీ బుంగ పడటంతో పాటుగా ప్రధాన రహదారి సైతం కొట్టుకు పోయింది. వన్ వే మాత్రమే కొనసాగుతోంది. ఎగువ రామాయంపేట, చేగుంట వద్ద ఎన్హెచ్ 44 ప్రమాదకరంగా మారింది. నిజామాబాద్ వైపు ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై వర ద పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. కామారెడ్డి జిల్లా అంతటా మండల కేంద్రాల నుం చి జిల్లా కేంద్రానికి కలిపే ఆర్ అండ్ బి రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. పూర్తిగా కొట్టుకుపోయిన ఘటనలు వెలుగు చూశాయి.
నిజామాబాద్లోనూ కుంభవృష్టి..
మొన్నటి వరకు లోటు వర్షాపాతం తో కొట్టుమిట్టాడిన ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలు వరద ఉధృతితో జలమయమయ్యాయి. వాన చినుకు లేక అల్లాడిన ఈ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీనికి తోడు గా కామారెడ్డి మీదుగా అటవీ ప్రాంతాల గుండా వచ్చిన వర ద పలు ప్రాంతాలను జలమ యం చేసింది. చెరువులకు గండ్లు పడటంతో పాటుగా ఆయా చెరువులు ఉధృతంగా అలుగు పారడంతో గిరిజన ఆవాస కేంద్రాలు వరదలో చిక్కుకున్నాయి. గురువారం నిజామాబాద్ జిల్లాలో నాలుగు మండలాల్లో అతి భారీ వర్షం కురిసింది. భీంగల్, సిరికొండ, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్లో 12సెం. మీట ర్లు నుంచి 20సెం. మీటర్ల వరకు వర్షాపాతం నమోదైంది. 17 మండలాల్లో భారీ వర్షం కురిసింది.