వానలు దంచికొట్టాయి. తాగు, సాగునీటికి ఏ ‘లోటు’ లేకుండా కుండపోత వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వరుణుడు.. సెప్టెంబర్ ఆరంభంతోనే దాడి చేశాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లో పడాల్సిన వానలు.. మూడు రోజుల్లోనే పడ్డాయి. ఫలితంగా కరువు ఛాయలు కనుమరుగయ్యాయి.
నిజామాబాద్‌లో 29.3శాతం అధికంగా..
నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో ప్రణాళికా విభాగం సేకరించిన గణాంకాల ప్రకారం.. 21 మండలాల్లో సగటు కంటే అత్యధికంగా వర్షం కురిసింది. 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా వార్షిక సరాసరి వర్షపాతం 1015.9 మిల్లీ మీటర్లు కాగా, జూన్ 1 నుంచి ఇప్పటివరకు 919 మి..మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో కురవాల్సిన సరాసరి వర్షం 710 మి.మీటర్లుగా ఉంది. మొత్తంగా 29.3శాతం అధికంగా నిజామాబాద్ జిల్లాలో నమోదైంది.
గడిచిన నాలుగైదు రోజుల్లోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. ఆగస్టు చివరిదాకా సగానికంటే ఎక్కువ మండలాలు లోటు వర్షపాతంతోనే కొట్టుమిట్టాడాయి. కొన్ని మండలాల్లో దుర్భర పరిస్థితులు తలెత్తగా, సెప్టెంబర్ నెలారంభంతో కరువు తీరా వానలు పడ్డాయి. నవీపేటలో ఆల్‌టైం రికార్డుగా 96.1శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఏర్గట్లలో 59.4, మెండోరాలో 58.1, ముప్కాల్‌లో 56 శాతం అధికంగా వానలు కురిశాయి. మోపాల్, రుద్రూర్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, డొంకేశ్వర్, కోటగిరి మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.
కామారెడ్డిలో 20.7శాతం ఎక్కువగా..
కామారెడ్డి జిల్లాలోని 24 మండలాల్లో ఇప్పటి వరకు 672 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. వార్షిక వర్షపాతం 996.7మి.మీటర్లు కాగా, ఇప్పటికే 20.7శాతం అధిక వర్షపాతం రికార్డు అయింది. మరికొద్ది రోజులు భారీ వానలు కురిస్తే ఈ సీజన్లోనే వార్షిక వర్షపాతాన్ని కామారెడ్డి జిల్లా చేరుకోనుంది. భిక్కనూర్‌లో 66.9, నస్రుల్లాబాద్‌లో 60.2, సదాశివనగర్‌లో 60.7శాతం చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది.
పెద్దకొడప్గల్, పిట్లం, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, బీబీపేట మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. 13మండలాల్లో కురిసిన వానలు ఫర్వాలేదనిపించగా, 8 మండలాల్లో అధిక వర్షపాతం, 3 మండలాల్లో అత్యధిక వానలు కురిసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు నెలలో 44శాతం లోటు వర్షపాతం ఉండగా, మూడు రోజుల్లో కురిసిన వానలతో అధిక వర్షపాతం నమోదైంది.
పంటలకు ఢోకా లేనట్లే..
భారీ వానలతో వందలాది చెరువులు అలుగులు పారుతున్నాయి. గోదావరి, మంజీరా నదులు ఉప్పొంగుతున్నాయి. కరువుతీరా పడిన ఈ వానలతో రైతాంగంలో హుషారు కనిపిస్తున్నది. చెరువులు నిండుకుండలా మారడంతో యాసంగి సాగుకు ఢోకా లేదని రైతులు సంబురపడుతున్నారు. అయితే, పంటల ఎదుగుదల దశలో ఏకదాటి వానలతో కొంత ఆందోళన చెందుతున్నారు. పంటలు దెబ్బితింటాయేమో? అన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వరుణదేవా.. ఇక వర్షం చాలించు అంటూ ప్రార్థిస్తున్నారు.
మొదట్లో అంతంతే..
వానకాలం ఆరంభంలో పెద్దగా వర్షాలు పడలేదు. జూన్ నెలంతా ఎండాకాలాన్ని తలపించినప్పటికీ మోస్త్తరు వానలు కురిశాయి. జూలైలో ఫర్వాలేక పోయినా ఆగస్టులో మాత్రం అంతంతే పడ్డాయి. అయితే, సీజన్ చివరి మాసంలో మాత్రం కుండపోత వానలు కురిశాయి. అతి భారీ వర్షాలతో లోటు వర్షపాతం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో ఏర్పడిన లోటు వర్షపాతం.. సెప్టెంబర్ నెల మొదటి రెండ్రోజుల్లోనే కురిసిన వర్షాలతో లోటు లేకుండా పోయింది.