మృత్యువుతో పోరాడి..

- రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్మీ జవాన్ మృతి
- విధులకు వెళ్లే ముందురోజే ప్రమాదం
- 18 రోజులు కోమాలో..
- ఇందల్వాయి మండలం మెగ్యానాయక్ తండా లో అంత్యక్రియలు..
- కన్నీరుమున్నీరైన గ్రామస్తులు
- మూడునెలల్లో పెండ్లి.. అంతలోనే విషాదం..
డిచ్పల్లి(ఇందల్వాయి)/సదాశివనగర్, జనవరి 15: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మెగ్యానాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ దెగావత్ మోతీలాల్(27) రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఆర్మీ దవాఖానలో శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఉత్తరాఖండ్‌లో విధులు నిర్వహిస్తున్న మోతీలాల్ డిసెంబర్ 14వ తేదీన సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. డిసెంబర్ 29వ తేదీన ఆయన విధులకు వెళ్లాల్సి ఉండగా.. 28వ తేదీన ఆయన హైదరాబాద్‌లో ఉండే తన మిత్రుడి వద్ద విమాన టికెట్ తీసుకొని మెగ్యానాయక్ తండాకు బైకుపై వస్తున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ వద్ద బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నది. దీంతో తీవ్ర గాయాలైన అతడిని యశోద దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఆర్మీ దవాఖానలో చేర్పించారు. కోమాలోకి వెళ్లిన అతడు శుక్రవారం వేకువజామున ఒంటిగంటకు మృతిచెందారు. ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెంటనే ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గోవర్ధన్‌తో మాట్లాడారు. కామారెడ్డిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయించారు.
బ్యాగును సిద్ధం చేసుకొని..
సెలవులు ముగియడంతో డిసెంబర్ 29న డ్యూటీకి వెళ్లేందుకు బ్యాగును సైతం మోతీలాల్ సిద్ధం చేసుకున్నాడు. 29న ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి పంజాబ్ వెళ్లేందుకు విమాన టికెట్ కూడా కన్ఫమ్ అయ్యింది. 28న రాత్రి ఇం దల్వాయి టోల్‌ప్లాజా వద్ద బస్సు ఎక్కి శంషాబాద్ వెళ్లాల్సి ఉంది. విమాన టికెట్ తెచ్చుకొనేందుకు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి.. అనంతలోకాలకు వెళ్లాడు. అతడి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మూడు నెలల్లో పెండ్లి.. అంతలోనే విషాదం..
మోతీలాల్‌కు ఇటీవల రూప్లానాయక్ తండాకు చెందిన యువతితో పెండ్లి నిశ్చయమైంది. మూడు నెలల అనంతరం సెలవుపై వచ్చినప్పుడు వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే అతడు మృతిచెందడంతో ఆ కుటుం బం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది. జవాన్‌ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గన్నారంలో విద్యాభ్యాసం..
మోతీలాల్ గన్నారం ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియెట్ నిజామాబాద్‌లోని విశ్వశాంతి జూనియర్ కళాశాలలో, బర్ధిపూర్ శివారులోని జ్ఞాన సరస్వతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన మోతీలాల్ ఆర్మీ రిక్రూట్మెంట్లో మొదటి ప్రయత్నంలో ఉద్యోగం సాధించి.. ఏప్రిల్ 7, 2017న ఆర్మీలో చేరాడు. మెగ్యానాయక్ తండాకు చెందిన దెగావత్ జోద్యానాయక్ జమిలిబాయి రెండో కుమారుడు మోతీలాల్. మొదటి కుమారుడు నూర్సింగ్ వ్యవసాయం చేస్తుండగా.. మూడో కుమారుడు చింటు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు..
జవాన్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పాల్గొన్నారు. మోతీలాల్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి వెంట ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్, ఇందల్వాయి ఎంపీపీ రమేశ్‌నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, విండో చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్‌కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్‌సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
- వరుసగా మూడో రోజూ 18 వేల కరోనా కేసులు
- రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే