తహసీల్ కార్యాలయాల్లో పారదర్శకంగా సేవలు

- ధరణి రాకతో తీరిన రైతుల భూ సమస్యలు
- నిమిషాల్లో పూర్తవుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్
- సీఎస్ హెచ్చరికలతో దారిలోకి వచ్చిన ధరణి ఆపరేటర్లు
- పెండింగ్ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్న వైనం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లో నెలకొన్న సమస్యలు తొలగించడంతోపాటు ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలను ఇస్తున్నది. భూమి కొనుగోలు చేసినా.. ఏండ్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోనివారు సైతం ఇప్పుడు ధరణికి క్యూకడుతున్నారు. దూరభారం తగ్గడం, ప్రక్రియ సులభతరం కావడంతో భూమిని కొన్న వెంటనే రిజిస్ట్రేషన్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పైరవీకారుల ప్రమేయం లేకపోవడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. చలానాకు మించి ఎక్కడా రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోవడంతో కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నా.. అధికారులు వాటిని అధిగమిస్తున్నారు. వేలిముద్రలు పడనివారికి ఐరిస్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అధికారులు పిలిచి మరీ రిజిస్ట్రేషన్లు చేస్తుండడంపై సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ‘అప్పట్ల సార్లు చెప్పిన టైముకు పోతుంటిమి.. ఇప్పుడు మాకు నచ్చిన రోజున పోతున్నం..’ అని రైతులు ధీమాగా చెబుతున్నారు.
-నిజామాబాద్ ప్రతినిధి /నమస్తే తెలంగాణ
ఏలిముద్ర పడ్తలేదని భయపడ్డ్డ..
నా పేరుమీద మూడెకరాలుంది. నాకున్న ఒక్క కొడుకు దేశం పోయిండు. నా భూమిలోంచి మనుమడు లోకేశ్‌కు ఎకరం రాసిద్దామనుకున్న. మీసేవకు పోయి పేరెక్కిచ్చుకున్నం. తెల్లారి తహసీల్ ఆఫీసుకు మనుమణ్ణి వెంట తీస్కవొయిన. సార్లు నా ఏలిముద్ర తీసుకుందామంటే పడలేదు. దీంతోటి రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. మస్తు బాధవడుకుంట ఇంటికిపోయిన. నాలుగు దినాలకు తహసీల్దార్ మేడమ్ నాకు ఫోన్జేసి.. ‘నీ మనుమడి పేర భూమి రిజిస్ట్రేషన్ చేస్తా.. రండి..’ అని చెప్పింది. ఏలిముద్ర పడ్తలేవని కండ్ల ఫొటోలు (ఐరిస్) తీసుకున్నరు. నా మనుమడి పేర పట్టా చేసిండ్రు. మస్తు సంబురమనిపించింది. ఎంబడే స్వీటుబిళ్లలు తెచ్చి తహసీల్దార్ మేడమ్, సార్ల నోరు తీపిచేశిన..
- కాళ్ల ఒడ్డెమ్మ, నాళేశ్వర్, నవీపేట
నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిధరణి అన్నదాతల్లో ధైర్యాన్ని నింపింది. ఏండ్ల తరబడి ఉన్న భూ సమస్యలన్నీ ధరణి రాకతో కనిపించకుండా పోతున్నాయి. నిమిషాల్లో చేతికి భూమి పట్టా అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించే రైతులకు నాడు రిజిస్ట్రేషన్ల సమస్య ఇక్కట్ల పాలుజేస్తే నేడు ధరణి వారికి వరంలా మారింది.
అన్నదాతల్లో ధరణి నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపింది. ఏండ్లుగా దున్నుకుంటున్న సొంత భూమికి హక్కుపత్రాలు దక్కాలంటే రైతులకు మొన్నటి వరకు నరకం కనిపించేది. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్ వరకు అడిగినంత డబ్బులు చెల్లించలేక వారిని సంతృప్తి పర్చలేక చతికిల పడేవారు. పైసలివ్వకపోతే చెప్పులు అరిగేలా తిరిగినా... కర్షకుల సమస్య పరిష్కారం అయ్యేది కాదు. పాత రెవెన్యూ వ్యవస్థలో అడుగడుగునా పాతుకుపోయిన అవినీతిలో సామాన్యులు రోజూ బలయ్యేవారు. ఒకానొక దశలో రెవెన్యూ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన వారెందరో ఉన్నారు. కర్షకుల కన్నీళ్లు తుడిచేందుకు, భూ బదలాయింపు ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం స్లాట్ బుకింగ్‌తో మండల స్థాయిలోనే నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి అవుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పైరవీల్లేకుండానే పారదర్శకంగా సేవలు అందుతుండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కానరాని పైరవీకారులు..
ధరణి పోర్టల్ వచ్చాక పైరవీ అనే పదం వినిపించడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. గతంలో కింది స్థాయిలో భూ బదలాయింపు ప్రక్రియ ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ధరణి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతున్నది. నిమిషాల్లోనే పనులు అయిపోతున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు వెళ్లి చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడా బాధలకు చెక్ చెబుతూ వ్యవస్థలో పెను మార్పు తెచ్చారు. ఎక్కడ చూసినా రైతుల కండ్లల్లో ఆనందం చూస్తున్నాం. ధరణితో రైతుల ఆస్తులకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తున్నది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి 10 నుంచి 15 నిమిషాల్లో పట్టా చేతికిచ్చి పంపుతున్నారు. రైతులకు సులభంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది.
ధరణిలో వేలిముద్రలు పడని వారికి ఐరిష్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకపోవడంతో రైతులు సంతోషంగా ఇండ్లకు తిరిగి వెళ్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చాలా సులభంగా జరుగుతున్నాయి. మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకుని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన అరగంటలోనే రిజిస్ట్రేషన్లు చేసి పంపుతున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తైన వెంటనే వారికి సంబంధించిన హక్కుపత్రాలు అందజేస్తున్నారు. పైరవీకారుల చేతివాటం పూర్తిగా పోయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు, అవినీతికి తావు లేకుండా ధరణి పోర్టల్‌లో జరుగుతున్న పనులపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
దారిలోకి వచ్చిన ధరణి ఆపరేటర్లు
ధరణి సేవలను దుర్వినియోగం చేసేందుకు కొంత మంది ఆపరేటర్లు అక్కడక్కడా అడ్డదారులు తొక్కేందుకు ప్రయత్నించారు. స్లాట్ బుకింగ్‌లో మాయాజాలం చేసేందుకు యత్నించగా ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘా వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారం మేరకు వెంటనే రంగంలోకి దిగింది. ధరణి ఆపరేటర్లు ముందస్తుగా స్లాట్ బుకింగ్‌లు చేసి రైతులను ఇబ్బందికి గురి చేసినా, పనులు చేసి పెడతామంటూ పైరవీలు చేసినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మూడు రోజుల క్రితమే స్పష్టం చేశారు. దీంతో ధరణి ఆపరేటర్లు అడ్డదారులు తొక్కేందుకు జంకుతున్నారు.
ఉభయ జిల్లాల్లోనూ కొంతమంది ఆపరేటర్లు అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు రైతులను నేరుగా అప్రోచ్ అవుతున్నట్లుగా అక్కడక్కడా అధికారులు గుర్తించారు. ఆదిలోనే ఇలాంటి అక్రమ చేష్టలను తుంచేసే పనిలో ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది. స్లాట్ బుక్ చేసుకున్న కొందరికి మరుసటి రోజునే పట్టాలు చేతికందుతున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన క్షణాల్లో మ్యుటేషన్ అయిపోతున్నది. వీటి కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్పింది. గతంలో సంవత్సరాల తరబడి ఇదే పని మీద తిరిగి, డబ్బులు ఖర్చు చేసుకున్న రోజులు పోయాయి. అమ్మినవారు, కొన్నవారు ఉంటే చాలు వెంటనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి.
తాజావార్తలు
- ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
- ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?
- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
- ధరణి’లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
- హెచ్-1బీపై ట్రంప్.. జో బైడెన్ వైఖరి ఒకటేనా?!
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం