గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Aug 22, 2020 , 00:40:09

మన పరిశ్రమలు ఎంత తుదం?

మన పరిశ్రమలు ఎంత తుదం?

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పక్క రాష్ట్రం లోని పలు పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న విషాద ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ కేం ద్రంగా ఎక్కువగా రసాయన పరిశ్రమలు ఉండడం, పలు జిల్లాల్లోనూ ఈ తరహా ఫ్యాక్టరీలు విస్తరించి ఉండడంతో తనిఖీలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఐదు కీలకమై న శాఖల నుంచి ఒక్కో ఉన్నతాధికారితో కమిటీగా నియమించి జిల్లా స్థాయిలో ఫ్యాక్టరీలను తనిఖీలు చేపట్టాలని  ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా ల్లో ఐదు శాఖలకు చెందిన అధికారులు రెండు వారాలుగా  ఫ్యాక్టరీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వేలాది పరిశ్రమలున్నాయి. వీటిలో ప్రమాదకర పరిస్థితులు ఉండే పలు ఫ్యాక్టరీలను వేరు చేసి వాటిని రెండు విభాగాలుగా విభజించారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లుగా వర్గీకరించి వీటిలోనే మొదట దశలో తనిఖీలు చేపడుతున్నారు. రెడ్‌ జోన్‌లో నిజామాబాద్‌లో 40, కామారెడ్డిలో 29 పరిశ్రమలను అధికారులు గుర్తించారు. ఆరెంజ్‌ జోన్‌లో రెండు జిల్లాల్లో కలిపి 206 పరిశ్రమలున్నాయి.

అప్రమత్తత... అనివార్యత...

కరోనా వైరస్‌ విస్తృతిని అడ్డుకునేందుకు మార్చి నెల 22 వ తేదీ నుంచి  మూడు నెలల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలైంది. మే రెండో వారం నుంచి ఒక్కో రంగానికి పరిమితులతో కూడిన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఎలాం టి కార్యకలాపాలకు నోచుకోని ఫ్యాక్టరీల్లో నిర్వహణ లేకపోవడం వంటి కారణాలతో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో స్టెరిలైట్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. అనేక మంది విషవాయువు ధాటికి విలవిల్లాడి పోయారు.  విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ ఘటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఫ్యాక్టరీలు మరమ్మతులు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేఫ్టీ చర్యల్లో లోపాలను సరిదిద్దుకోవాలని పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వాలు సూచనలు చేశాయి. అయితే, కొంత మంది రక్షణ చర్యలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరికొంత మంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో పరిశ్రమల శాఖ అప్రమత్తమై ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరుగకుం డా తీసుకుంటున్న చర్యలపై తనిఖీలు చేపట్టాల్సింది గా యంత్రాంగాన్ని ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో రెండు వారాలుగా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఐదు శాఖలతో కమిటీ...

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 100 కిలో మీటర్ల దూరం లో ఉన్న కామారెడ్డి జిల్లా జంగంపల్లి శివారులో అనేక ఫ్యా క్టరీలు నెలకొల్పారు. ఇందులో రసాయన, ఫార్మా కంపెనీలున్నాయి. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా పారా బాయిల ర్‌ రైస్‌మిల్లులు, ప్లాస్టిక్‌ ఆధారిత పరిశ్రమలు అనేకం ఉ న్నాయి. ఫ్యాక్టరీస్‌ చట్టం ప్రకారం ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైర్‌ సేఫ్టీతో పాటు పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. వీటిలో సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ను పరిశీలించేందుకు ప్రభుత్వం ఐదు శాఖలతో కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌, బాయిలర్‌ అధికారి, కార్మిక శాఖ అధికారి, కాలుష్య నియంత్రణ అధికారులతో కూడిన బృందం పరిశ్రమలను పరిశీలిస్తున్నది. నిజామాబాద్‌ జిల్లాలో రెడ్‌ జోన్‌ పరిధిలో 40 పరిశ్రమలున్నాయి. ఆరెంజ్‌ జోన్‌లో 148 పరిశ్రమలున్నట్లు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో రెడ్‌ జోన్‌లో 29 పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఇందులో 5 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌ లో 58 పరిశ్రమలను వర్గీకరించారు. ఉమ్మడి జిల్లాలో రెడ్‌ జోన్‌లో మొత్తం 69, ఆరెంజ్‌ జోన్‌లో మొత్తం 206 పరిశ్రమలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

త్వరలో ప్రభుత్వానికి నివేదిక...

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను తెలుసుకునేందుకు చేపడుతున్న తనిఖీల ప్రక్రియ మరికొద్ది రోజులు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ తనిఖీలు నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు రావడంతో తనిఖీల్లో నిమగ్నమయ్యారు.  ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోని పరిశ్రమల్లో తనిఖీల్లో భా గంగా గుర్తించిన లోపాలను, ఇతర అంశాలతో కమిటీ సభ్యులు నివేదికలు రూపొందిస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమలుండగా ప్రమాదకరమైన వాటిని ప్రత్యేకంగా గుర్తించి వాటిలోనే తనిఖీలు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భద్రతా ప్రమాణాలకు సంబంధించిన నివేదికలను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు అందజేయనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.


logo