శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - May 21, 2020 , 01:37:02

ఖాకీలకు ‘కట్టడి’ సవాల్‌ !

ఖాకీలకు ‘కట్టడి’ సవాల్‌ !

  • సడలింపులతో పెరిగిన జనసంచారం 
  • మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి వలసలు 
  • కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా నిబంధనల అమలులో పోలీసుల తలమునకలు 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: కరోనా ఫ్రీగా మారడంతో నిజామాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీంతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకోవడంతో జనసంచారం పెరిగింది.  మొన్నటి వరకు కరోనాను కంట్రోల్‌ చేసే క్రమంలో అహోరాత్రులు కష్టపడి పహారా కాసిన పోలీసులకు ఇప్పుడు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి రాలేదు. జిల్లా సరిహద్దుల నుంచి ఇతర రాష్ర్టాలకు రాకపోకలను అనుమతించడం, ఆర్టీసీ బస్సులు తిరుగుతుండడం, సడలింపులు ఇవ్వడంతో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. షాపింగ్‌ హడావుడి మొదలవుతున్నది. ఎండలు మండుతున్నా జనం తిరగడం మానడం లేదు. నిత్యం పనుల కోసం బయటకు వచ్చేవారు కొందరైతే, మొన్నటి వరకు స్వీయ గృహ నిర్బంధంలో ఉండి స్వేచ్ఛగా బయట తిరగడానికి వస్తున్న వారు మరికొందరు ఉంటున్నారు. ఈ క్రమంలో భౌతికదూరం, మాస్కులు ధరించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడంతో కరోనా ముప్పు పొంచి ఉంది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకు రోడ్డుపై వాహనం కనిపిస్తే చెకింగ్‌చేసి ఆరాతీసి పంపేవారు. దీంతో జనం అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావడానికి సాహసించేవారు. ఇప్పుడు సడలింపులు ఇవ్వడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. నిజామాబాద్‌ నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయడం ఇంకా మొదలు కాలేదు. దీంతో ట్రాఫిక్‌ నియంత్రణ కరువైంది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న జనం.. ముందు జాగ్రత్త చర్యలు పాటించడం లేదు. నిబంధనలు పాటించకుండా తిరుగుతుండడంతో  పరిస్థితి మళ్లీ చేయి దాటుతుందనే ఆందోళన పోలీసుల్లో నెలకొంది. రంజాన్‌ మాసం కావడంతో నగరంలో షాపింగ్‌ సందడి మొదలైంది. ఎవరినీ నియంత్రించే పరిస్థితి కనబడడం లేదు. ఎవరికి వారే ముందు జాగ్రత్తలు తీసుకొని సామాజిక బాధ్యత కింద భౌతికదూరాన్ని పాటించడం, మాస్కులు ధరించి కరోనా దరిచేరకుండా చూసుకోవాల్సిన తరుణమిది. దీన్ని చాలామంది పాటించడం లేదు. ఇదే ఇప్పుడు పోలీసులకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నది. మొన్నటి వరకు నిద్రాహారాలు మాని కరోనా డ్యూటీలోనే రాత్రనకా పగలనకా గడిపిన పోలీసులకు ..ఇప్పుడు కూడా అదే డ్యూటీ కొనసాగుతున్నది. దీంతో ఇప్పటికీ ఇతర విధులు నిర్వర్తించడానికి సమయం కేటాయించలేకపోతున్నారు. దాదాపు 300మంది పోలీసు సిబ్బంది ఇంకా కరోనా నియంత్రణ డ్యూటీలోనే ఉన్నారు. ఈ వేసవిలోనే ఇంత భయపడితే రానున్నది వర్షాకాలం.. వైరస్‌ వ్యాప్తి ఆ సమయంలో మరింత విస్తృతమయ్యే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో జనం ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిఉంటుంది. దీన్ని గుర్తించి ప్రజలు పరిమితులకు లోబడి తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.logo