Lok Adalath | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 1794 కేసులకు పరిష్కారం లభించింది. న్యాయస్థానంలో నిర్వహించిన నాలుగు బెంచీలకు గాను నలుగురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు సభ్యులుగా వ్యవహరించారు. మొదటి బెంచ్ కి ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది డాక్టర్ మధు సింగ్ సభ్యురాలిగా వ్యవహరించారు.
రెండవ బెంచ్ కి సబ్ జడ్జి కాంచన రెడ్డి, మూడవ బెంచ్ కి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పూజిత, నాలుగో బెంచ్ కి అడిషనల్ మెజిస్ట్రేట్ సాయి శివ లు కేసులను పరిశీలించి, పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా రూ. 79,96,2950 ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని కోర్టువర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు న్యాయమూర్తులు మాట్లాడుతూ కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీమార్గమే రాజమార్గమని, దీని ద్వారా ప్రజలకు డబ్బులతో పాటు కాలం కూడా కలిసి వస్తుందని అన్నారు.