కామారెడ్డి, మార్చి 11: పదో తరగతి పరీక్షలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే టెన్త్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగనున్న వార్షిక పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 37 వేల మంది హాజరు కానున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న 6,451 మంది బాలురు, 6,703 మంది బాలికలు కలిపి మొత్తం 13,154 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 12,244 మంది బాలురు, 12,155 మంది బాలికలు హాజరు కానున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పదో తరగతి ఫలితాల్లో ఉభయ జిల్లాల ప్రదర్శన చెప్పుకోదగిన రీతిలో ఉండడం లేదు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనే ఉండేది. రెండేండ్లుగా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడుతున్నది. గత రెండు సంవత్సరాల నుంచి కామారెడ్డి జిల్లా మరీ దారుణంగా వెనుకబడి పోతున్నది. 2023-24 సంవత్సరంలో 92.71 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. 2024-25 లో 94.65 శాతం ఉత్తీర్ణతతో 20వ ర్యాంకుకు పడిపోయింది. నిజామాబాద్ జిల్లా కూడా పెద్దగా పురోగతి సాధించలేదు. ఈ నేపథ్యంలో ఉభయ జిల్లాల యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రెండు జిల్లాల పరిస్థితి ఈసారైనా మారుతుందా? ఉమ్మడి జిల్లా మళ్లీ మొదటి వరుసలో నిలుస్తుందా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది వరకు వార్షిక పరీక్షలు ఆదివారాలు మినహా వరుసగా నిర్వహించేవారు. ఈసారి మాత్రం ఒక్కో పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజుల వరకు గడువు పెంచారు. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లిష్, 28న మ్యాథ్స్, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. 15, 16 తేదీల్లో ఒకేషనల్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిమిత్తం 24 గంటల పాటు పని చేసేలా కంట్రోల్ నంబర్ (కామారెడ్డి-99596 70118, నిజామాబాద్-90302 82993) ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో టెన్త్ స్టూడెంట్స్పై ప్రత్యేక దృష్టి సారించే వారు. వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే పదో తగరతి విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేసే వారు. స్పెషల్ క్లాసుల నిర్వహణతో బడిలోనే ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందించేది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవని అల్పాహారం ఎత్తివేశారు. చాలాచోట్ల స్నాక్స్ కూడా పెట్టలేదు. అంతేందుకు చాలా పాఠశాలల్లో స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ లేకుండా పోయాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్ జరగకుండా చూస్తున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. – రాజు, డీఈవో, కామారెడ్డి