నిజామాబాద్, జూన్ 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. పంటల సాగుకు పడరాని పాట్లు ఎదురవుతుండటంపై ఆగ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు కనీసం యూరియా సరఫరా సరిగా జరగడం లేదని మండిపడుతున్నారు. యూరియా కొనుగోలు చేసేందుకు యాప్ లో బుకింగ్ చేసుకునే ఏర్పాటు చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గ్రామాల్లో రైతుల్లో అనేకులు నిరక్షరాస్యులే ఉన్నారు. నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో మొబైల్ ఫోన్ వాడకం తెలిసిన రైతులు లేరు.
స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నప్పటికీ యూరియా బుక్ చేసుకునేంత పరిస్థితి కనిపించడం లేదు. ఇతరులపై ఆధారపడితే తప్పా యూరియా బుకింగ్ జరగడం లేదు. బుకింగ్ కోసం ఓటీపీ నమోదులో అనేక అవస్థలు తప్పడం లేదు. అవసరానికి యూరియా యాప్ ఓపెన్ చేస్తే అందులో నిల్వలకు సంబంధించిన సమాచారం తెలియడం లేదు. ఒక వేళ స్టాక్ ఉంటే నిమిషాల్లోనే గాయబ్ అవుతోంది. వేగంగా బుకింగ్ చేసుకుని యూరియాను ఇంటికి తెచ్చుకునే పరిస్థితి సామాన్య రైతులకు దక్కడం లేదు. ఓ వైపు కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్లు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ అనేక చోట్ల యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తుంటే సమాధానం ఇవ్వడం లేదు.
నిజామాబాద్ జిల్లాలో 2026-27 వానాకాలం సీజన్‌కు యూరియా 80,857 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ గుర్తించింది. డీఏపీ 14,591 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 13,201 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 45,122 మెట్రిక్ టన్నులు మేర వినియోగం కానుంది. కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలానికి 50,079 మెట్రిక్ టన్నులు యూరియా, డీఏపీ 11,318 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 9419 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 26,468 మెట్రిక్ టన్నులు అవసరం కానుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రతి పంట కాలంలో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
సాగు ప్రారంభంలోనే యూరియా చేతికి అందకపోవడంతో షురూ అవుతోన్న ఇబ్బందులు… పంట విక్రయం వరకు వెంటాడుతున్నాయి. అవసరానికి యూరియా చేతికి అందకపోవడంతో పంట ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం, పది రోజులు తండ్లాడితే తప్పా చేతికి యూరియా సంచులు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. భూ విస్తీర్ణాన్ని అనుసరించి విడతల వారీగా యూరియా పంపిణీ ప్రక్రియ చేపట్టడం మూలంగా దుకాణాల చుట్టూ తిరగడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని దుకాణాలు కాకుండా యూరియా నిల్వలు కలిగిన ఇతర గ్రామాల్లోకి పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు తీవ్రమైన గోస పడుతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతుకు దినదిన గండం అన్నట్లుగా వ్యవసాయం మారింది. ప్రజాపాలనలో రైతులంతా భరోసా లేక ఆగమాగం అవుతున్నారు. పంటల సాగు కష్టం కావడంతో అల్లాడి పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కేసీఆర్ పాలనలో యూరియాకు యాప్ వంటి విధానాలే కనిపించలేదు. దుకాణాల చెంతకు రైతు వెళ్లకుండానే పొలాల గట్లపైకి సంచులు వచ్చేవి. ఆటో డ్రైవర్‌కు సమాచారం ఇస్తే యూరియా సంచులు ఇట్టే చేతికి అందేవి. అలాంటి పరిస్థితి పూర్తిగా మారి పోయింది.
యూరియా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇక కౌలు రైతుల బాధలు వర్ణనాతీతంగా మారింది. పట్టాదారు మొబైల్ ఫోన్లకు వెళ్లే ఓటీపీని యాప్‌లో నమోదు చేయడం కత్తిమీది సాములా మారింది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లిన వారికి తలపోటు తప్పడం లేదు. ఓటీపీ సమస్యతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలతో విసుగు చెందిన రైతులంతా స్వచ్ఛందంగా రోడ్డు మీదికి వచ్చి యూరియా యాప్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే యూరియా సైప్లె చేయాలని కోరుతున్నారు. యాప్ వల్ల సమయం వృథా అవ్వడంతో పాటుగా దూరభారం పెరిగి ఖర్చులు తడిసి మోపెడు అవుతోందని రైతులు బాధ పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం యూరియా యాప్ రద్దు చేయకపోతే తగిన స్థాయిలో బుద్ధి చెబుతామని రైతులంతా హెచ్చరిస్తున్నారు.