ఖలీల్‌వాడి/కామారెడ్డి, డిసెంబర్ 17: ఫార్మా సిటీకి భూములు ఇవ్వని గిరిజన రైతులపై ప్రభుత్వం ప్రతాపం చూపించి అక్రమంగా నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. రైతులకు సంఘీభావంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతలు నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ నీతూకిరణ్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారన్నారు. లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, అక్రమంగా నిర్బంధించారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయన్నారు. నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నేతలు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, తెలంగాణ శంకర్, కరిపె రాజు, చింతకాయల రాజు, భాస్కర్, భూపతి, కృష్ణ, సాదిక్, నీలగిరి రాజు, గాండ్ల లింగం తదితరులు పాల్గొన్నారు.
లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కామారెడ్డిలో గులాబీ శ్రేణులు నిరసన చేపట్టాయి. రైల్వే కమాన్ బ్రిడ్జి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన రైతుల భూములను అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. గిరిజనులకు మద్దతుగా బీఆర్ఎస్ ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. గిరిజన రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపైనా పెట్టిన కేసులను ఎత్తివేసి, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమల భానుప్రసాద్, నాయకులు గెరిగంటి లక్ష్మీనారాయణ, కృష్ణాజిరావు, జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంతరాములు, మల్లేశ్ యాదవ్, కృష్ణయాదవ్, సంగిమోహన్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద, డిసెంబర్ 17: ఫార్మాసిటీ పేరిట గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. భూములు ఇవ్వమన్నందుకు లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అక్రమంగా జైలులో నిర్బంధించారన్నారు. గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం షిండే మాట్లాడారు.
రాష్ట్రంలో రైతన్నలపై అరాచకాలు, అణచివేతలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలన్నారు. గిరిజనుల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. అందుకోసమే ఫార్మా సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పేర్లతో మాయమాటలు చెబుతూ, ఎలాగైనా భూములు లాక్కుని తన అల్లుడికి అప్పజెప్పాలని సీఎం యత్నిస్తున్నారని ఆరోపించారు.
భూములు ఇవ్వమన్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, ఉపాధ్యక్షుడు నాల్చర్ శ్రీనివాస్, రాంచందర్, నాల్చర్ రాజు, మల్లికార్జున్, బస్వరాజ్ పటేల్, సంజూపటేల్ తదితరులు పాల్గొన్నారు.