గురువారం 25 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 24, 2021 , 01:43:11

ఐరిస్‌తో రేషన్

ఐరిస్‌తో రేషన్

  • ‌ఫిబ్రవరి నుంచి ఐరిస్‌, ఒటీపీతో పంపిణీకి సర్కారు చర్యలు
  • వృద్ధులు, ఇతరులకు తొలగనున్న ఇబ్బందులు
  • ఉమ్మడి జిల్లాలో7,44,361 కార్డులు

నిర్మల్‌ అర్బన్‌, జనవరి 23 : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీకి సర్కారు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నాలుగు నెలలుగా అనగా అక్టోబర్‌ మాసం నుంచి బయోమెట్రిక్‌(వేలిముద్రలు) ఆధారంగా చౌక ధరల దుకాణాల్లో సరుకులు సరఫరా చేస్తున్నది. దీనితో వృద్ధులు, కార్మికుల వేలి ముద్రలు పడక దుకాణాల వద్ద పడిగాపులు కాసేవారు. దీంతో సర్కారు హైకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి ఐరిస్‌, ఓటీపీ విధానంలో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చదువుకున్న వారికి ఓటీపీ సహాయంతో, నిరక్ష్యరాస్యులు, వృద్ధులు, ఇతరులకు సెల్‌ సదుపాయం లేని వారికి ఐరిస్‌తో రేషన్‌ సరుకులు అందించడంతో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు దూరం కానున్నాయి.

అక్రమాలకు చెక్‌

ఐరిష్‌, ఓటీపీ ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంతోపాటు అక్రమ రేషన్‌ సరఫరాను కూడా అరికట్ట వచ్చని సర్కారు భావిస్తున్నది. నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో నూతన విధానం ద్వారా రేషన్‌ను అందించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐరిష్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. పలు రేషన్‌ దుకాణాల్లో ఓటీపీతో ఇప్పటికే రేషన్‌ అందిస్తుండగా.. మిగిలిన దుకాణాలతోపాటు ఇతర జిల్లాల్లో అధికారికంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ లబ్ధిదారులు  ఆధార్‌ కార్డుకు రిజిస్టర్‌ చేసుకున్న సెల్‌ నంబర్‌కు రేషన్‌ తీసుకునే సమయంలో ఓటీపీ వస్తుంది. ఈ నంబర్‌ చెబితే దుకాణాదారులు సరుకులు ఇస్తారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 7,44,361 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో నిర్మల్‌ జిల్లాలో 2,04,292, ఆదిలాబాద్‌ జిల్లాలో 1,88,491, మంచిర్యాల జిల్లాలో 2,14,268, ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,37,310 రేషన్‌ కార్డులు ఉన్నాయి. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి నూతన విధానంతో రేషన్‌ ఇస్తుండడంతో లబ్ధిదారుల  సమస్యలు దూరం కానున్నాయని నిర్మల్‌ డీఎస్‌వో కిరణ్‌కుమార్‌ తెలిపారు.


VIDEOS

logo