బుధవారం 20 జనవరి 2021
Nirmal - Sep 06, 2020 , 02:35:38

ఆహ్లాదాన్ని పంచుతున్న రంగశివుని పార్కు

ఆహ్లాదాన్ని పంచుతున్న రంగశివుని పార్కు

  • n వన్నె తెచ్చిన పూలు, పండ్ల మొక్కలు 
  • n ఆకట్టుకుంటున్న పెయింటింగ్స్‌
  • n సర్పంచ్‌ దత్తురాం కృషితో కొత్తరూపు
  • n వనం కోసం భూమిని దానం చేసిన గ్రామస్తుడు

నిత్యం తమ పనుల్లో తీరిక లేకుండా గడిపే గ్రామీణ ప్రజలకు, చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం సంకల్పించిన పల్లె ప్రకృతి వనాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కుభీర్‌ మండలంలోని రంగశివునిలో 55 రోజుల క్రితం ఈ వనం పనులు మొదలుపెట్టగా, ఆదిలోనే అందరి మన్ననలు పొందుతున్నది. మనసుంటే మార్గముంటుందని నమ్మే స్థానిక సర్పంచ్‌ జాదవ్‌ దత్తూరాం పటేల్‌ చొరవతో ఈ పార్కు ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.        - కుభీర్‌

నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలంలోని రంగశివుని పల్లె ప్రకృతి వనం అందరినీ ఆకట్టుకుంటున్నది. ఆరంభంలోనే ఆహ్లాదపూరిత వాతావరణాన్ని తలపిస్తూ, దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ నిర్మల్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ పట్టణాల నర్సరీల నుంచి తెచ్చిన అల్లనేరేడు, అశోక, కొబ్బరి, మామిడి, జామ, రకరకాల పూలమొక్కలు షో అందాల మొక్కలు తెచ్చి నాటించారు. ప్రత్యేకంగా రోడ్డు వేయించారు. నీటి ట్యాంకు, బండ రాళ్లపై  పాల పిట్ట, పులి, రామచిలుక, జింక లాంటి అడవి పక్షులు, జంతువుల పెయింటింగ్స్‌ వేయించారు. పార్కులో ఊయల ఏర్పాటు చేశారు. ఈ వనానికి ముఖ ద్వారం కూడా ఏర్పాటు చేసి, గేటు పెట్టించడంతో ప్రత్యేక వన్నె వచ్చింది. చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసి పశువుల నుంచి రక్షణ ఏర్పాటు చేశారు. 

గ్రామస్తుల సహకారంతోనే..

పల్లె ప్రకృతి వనం కోసం గ్రామానికి చెందిన కేశవ్‌దాస్‌ భూమిని దానం చేశారు. ఆయనకు మా గ్రామ ప్రజలందరి తరఫున అభినందనలు. రెండు నెలలుగా ఈపార్కు కోసం నేను, మా పంచాయతీ కార్యదర్శి పని చేస్తున్నాం. పార్కులో ఇవన్నీ మా ఇద్దరి మనసుతోనే చేశాం. నిత్యం గ్రామ యువకులు, రైతులు, వృద్ధులు పార్కులో సేదతీరుతున్నారు. గ్రామస్తులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. నాటిన ఈ మొక్కలు పెద్దవైతే నీడ పుష్కలంగా లభిస్తుంది. 

-జాదవ్‌ దత్తురాం పటేల్‌, సర్పంచ్‌, రంగశివుని పల్లె

ప్రభుత్వ ఆలోచన గొప్పది..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన గొప్పది. పల్లెల్లో కూడా ప్రకృతి వనం ఉండాలని భావించి, ప్రతి జీపీలో ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. మా సర్పంచ్‌ ప్రత్యేక చొరవతో చాలా మంచిగా తీర్చిదిద్దారు. భవిష్యత్‌లో దీనిని మరింత చక్కగా అభివృద్ధి చేసుకుంటాం. గ్రామస్తులు ఆహ్లాదపూరిత వాతావరణంలో గడిపేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పట్టణాల్లో ఉన్నట్లే ఇక్కడా పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం బాగుంది.             - కాన్షీరాం, గ్రామస్తుడు

ఆహ్లాదపూరితంగా పల్లెప్రకృతి వనం

కుంటాల : మండలంలోని ఓలా గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. రైతులకు, చిన్నారులకు, మహిళలకు పూర్తి స్థాయిలో ఉల్లాసాన్నిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్‌ ఖనీష్‌ ఫాతిమా ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టారు. వివిధ రకాల మొక్కలు నాటి మండలంలోనే విలేజ్‌ పార్కును సుందరంగా మార్చారు. రానున్న రోజుల్లో ఈ విలేజ్‌ పార్కును మరింత ఆకర్షణీయంగా మార్చుతామని సిబ్బంది చెబుతున్నారు. ప్రతి మొక్కనూ సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.logo