– హెచ్ఎంఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు
రామవరం, డిసెంబర్ 20 : కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని కోల్ మైన్స్ లో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా యాజమాన్యంలో మార్పు రావడం లేదని హెచ్ఎంఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలేకాని నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పట్ల ఉద్యేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత నెల రోజుల్లో మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఫిట్నెస్ లేని వోల్వో లు నడపడం, అనుభవం లేని టెక్నిషన్స్ ని ఉపయోగించడం, రక్షణ సూత్రాలను పాటించకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు ఆయన అన్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదం సైతం వోల్వోకి ఫిట్నెస్ లేకపోవడం, బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే జరిగిందే తప్పా మరేమీ కాదన్నారు. వోల్వోస్ కి ఫిట్నెస్ లేనప్పుడు వాటిని నడిపించడం వల్ల కార్మికుల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నట్లే అన్నారు. ఎస్ ఓ పి (సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్)లు ఏమైయ్యాయి. ఎస్ ఎం పి (సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్) ఎక్కడ పోయాయి. రక్షణ వారోత్సవాలు జరిగి మూడు రోజులు కూడా కాకముందే ప్రమాదం చోటుచేసుకుందన్నారు.
కాంట్రాక్టర్లు రాజకీయ అండదండలతో చేలరేగిపోతున్నారని, రక్షణ సూత్రాలు పాటించకపోవడం వల్లే ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. సేఫ్టీ ఆఫీసర్, వాహనాల ఫిట్నెస్ ఆఫీసర్ నిద్రావస్థలో ఉన్నారా? వాళ్లు డ్యూటీ సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వెంకటేష్ గని ఓసి లో ఉన్న కార్మికులు మనోవేదన చెందుతున్నారు అన్నారు. యూనియన్లు, అధికారుల నిర్లక్ష్యం చూసి వాపోతున్నారన్నారు. ఇవన్నీ హెచ్ఎంఎస్ యూనియన్ చూస్తూ ఊరుకోదన్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పు జరగడానికి కారణం అయిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ యూనియన్ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.