– ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసే మోదీ చర్యలను వ్యతిరేకించండి
– సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపు
రామగిరి, డిసెంబర్ 20 : ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వికసిత్ భారత్ రోజ్గార్ అజీవిక మిషన్ (గ్రామీణ) (Vb – G RAM G) 2025 బిల్లు రద్దు చేయాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎందుకు రద్దు చేయబోతున్నారో మోదీ ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదని విమర్శించారు. ఈ కొత్త బిల్లు ఉన్న ఉపాధిని లేకుండా చేస్తున్నదన్నారు. వ్యవసాయ సీజన్లో రైతులకు కూలీల కొరత లేకుండా అని రైతుల ముసుగు తగిలించారని విమర్శించారు.
ఉపాధి హామీ పనులు ఫిబ్రవరి 20 నుండి జూన్ 20 వరకు 75 శాతానికి పైగా జరుగుతాయని ప్రభుత్య లెక్కలు చెబుతున్నాయంటే వ్యవసాయ పనులు పెద్దగా లేని సమయంలో రైతులకు ఎంఎస్పీ, పంట పెట్టుబడి నుండి తప్పించుకోవటానికే కదా అన్నారు. ఇప్పటి వరకు 90 శాతం ఉపాధి హామీ పనుల నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా ఉండేదని ఇప్పుడు 40 శాతం వాటా రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే రాష్ట్రాలపై భారం వేయ్యటం అన్నారు. పనులను 4 రకాలుగా విభజించి కోట్ల రూపాయల పనులను చేర్చారని అంటే యంత్రాలు, కాంట్రాక్టర్లకు ఉపాధి హామీగా మార్చటమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల కంటే రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలని ఇప్పుడు ఉన్న దానిని కొత్త బిల్లులో రద్దు చేశారని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలు పెరగాలని ఉన్న నిబంధన ఇప్పుడు తొలిగించారని అన్నారు. ఆధార్ నిబంధన కచ్చితంగా అమలు చేయడం లేదని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసి ఇప్పటికే ఉపాధికి ఆధార్ లింక్, కొలతలతో వేతనాలు ఇస్తూ రెండు పూటల హాజరు, కేవైసీ చట్ట విరుద్ధంగా పెట్టారని ఆందోళనకు చేస్తుంటే ఇప్పుడు బయోమెట్రిక్, ఏఐ, జీపీఎస్ ను చట్టబద్దం చేయ్యటం కంటే పేదలను ఉపాధి హామీ నుండి తొలగించడం తప్పా మరొకటి కాదని విమర్శించారు.
ఇప్పటి వరకూ పంచాయతీలు ప్రధాన పాత్ర ఉన్నదని ఇప్పుడు అన్ని అధికారాలు కేంద్రంకు ఉంటాయని, చివరకు సోషల్ ఆడిట్ కూడా మనుషులు కాకుండా టెక్నాలజీ తో చేస్తామని ప్రభుత్వం చెబుతుందని దీని వలన ఉపయోగం ఎవరికి ఉంటుందని అడిగారు. ఉపాధి హామీ నిధులతో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం ఇస్తున్న భూముల అభివృద్ధి, కాలనీల అభివృద్ధి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నివాస ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఉపాధి నిధులు మంజూరు చేస్తూ పనులు చేపట్టడం జరిగిందని ఇప్పుడు వాటి ప్రస్తావనే లేకుండా పోయిందని, ఇలాంటి అనేక అంశాలు ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కొత్త బిల్లు ఉపాధిని హరించేదిగా కొద్ది మేరకు ఉన్న ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోతవని, అందుకే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాలకు విస్తరించి మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అవుట రవీందర్, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, అద్దంకి నరసింహ, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, ఎండి సర్దార్ అలీ, ఉడుగుండ్ల రామకృష్ణ, గంజి రాజేష్, విష్ణుమూర్తి, అనురాధ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.