Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు అనుమతిని ఇస్తూ శనివారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ కోసం రూ.50వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. తిరిగి ఈ నెల 11వ తేదీన సరెండర్ కావాలని సూచించింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ ఏ4గా చేర్చింది. ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీన ఆయనను విజయవాడలోని కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అనంతరం అదే రోజు రాత్రి ఆయన్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు బెయిల్ దొరకడం లేదు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు మధ్యంతర బెయిల్ దొరకడం గమనార్హం.