అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగ సమస్యలపై వైసీపీ పోరుబాట ( YCP protests ) పట్టనుంది. యూరియా కొరతతో ( Urea shortage ) పాటు రైతుల సమస్యలపై ఈనెల 9న ఏపీలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjal Ramakrishna Reddy ) అన్నదాత పోరు పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.
అనంతం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జోరుగా సాగు జరుగుతుంటే మరోవైపు యూరియ దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులు యూరియా అడుగుతుంటే బొక్కలో తోస్తానంటూ సీఎం చంద్రబాబు( Chandra Babu ) రైతులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు. యూరియాను టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించారని మండిపడ్డారు.
యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడడం సీఎం కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచేంత వరకు వైసీపీ వెనుకడుగు వేయదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్‌కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.