తాండూర్ : తెలంగాణలో పింఛన్లు( Pensions ) పెంచే వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడుతూనే ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ( Mandakrishna Madiga ) అన్నారు . శనివారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో చేపట్టిన మహా గర్జన ( Mahagarjana ) సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 200కు పెంచారని , దశలవారీగా ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటలతోనే 2014లో అన్ని పార్టీలు వేయి రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయని గుర్తు చేశారు. తమ పోరాటాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెయ్యి రూపాయల పెన్షన్ పెంపు సాధ్యమైందన్నారు.
అనంతరం 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మార్పీఎస్ ఒత్తిడితోనే రూ. 2 వేల పెన్షన్ పెంపు సాధ్యమైందన్నారు 2023లో రూ. 4వేల పెన్షన్ను ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 21 నెల లైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులతో ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పెన్షన్ పెంపును విస్మరించడం సరికాదన్నారు. ఈ పెన్షన్ పెంపు చేపట్టే వరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈనెల 8న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, 20న మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం తోపాటు దశల వారి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, నియోజకవర్గ ఇన్చార్జి జిలకర శంకర్, నాయకులు గణేష్, తదితరులు ఉన్నారు.