DGP Jitender | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం ఆదివారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు.
ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం ముగిసిన అనంతరం డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడారు. విజయవంతంగా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ముగిసింది. గత ఐదేండ్ల నుంచి విజయవంతంగా నిమజ్జనం సాగుతుంది. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
బాలాపూర్ గణేష్ కూడా నిమజ్జనానికి బయలుదేరింది.. సాయంత్రం 4 గంటల్లోపు బాలాపూర్ గణనాథుడు నిమజ్జనం అవుతుంది. సాయంత్రం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో నిమజ్జనాలకు వినాయకులు తీసుకొస్తున్నారు. ప్రజలు, మండపాల్లో వినాయకుడిని త్వరగా నిమజ్జనానికి తీసుకు రావాలి. పోలీసుల సూచనలు పాటిస్తూ భక్తులు ముందుకు వెళ్ళాలని డీజీపీ సూచించారు.
నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో హైదరాబాద్ నగరమంతా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 8 వేల మంది పోలీసులను ఇతర జిల్లాల నుంచి తెప్పించి భద్రతా ఏర్పాటు చేశాం. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లో బందోబస్తు పెట్టాం. ఎప్పటికప్పుడు నిమజ్జనాల ప్రక్రియను డీజీపీ ఆఫీసులో, బంజారాహిల్స్ ఐసీసీసీలో మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ బైంసాలో నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాలో నిన్న నిమజ్జనం పూర్తయింది. రాష్ట్రంలో 1.60 లక్షలు విగ్రహాలు పెట్టారు.. 80వేలు పూర్తయ్యాయి.. 36 వేలు పెండింగ్ ఉన్నాయి.. ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నయని డీజీపీ తెలిపారు.