తిరుమల : టీటీడీ (TTD ) శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు (Anonymous devotee ) శుక్రవారం రూ. కోటి 50 వేలను విరాళంగా ( Donation) అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు అందజేశారు.
ఈనెల 6న అనంత పద్మనాభ వ్రతం..
తిరుమలలో ఈనెల 6 అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి అర్చకులు ఆగమొక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు వివరించారు. అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారన్నారు.
అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారని తెలిపారు. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వెల్లడించారు.
తిరుమల శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారని వివరించారు.