కోల్కతా, ఫిబ్రవరి 25: పాలసీదారులను ఆకట్టుకోవడానికి పెట్టే ఖర్చులు, ఇతరత్రా నిర్వహణపరమైన వ్యయాలను బీమా సంస్థలు తగ్గించుకోవాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సభ్యుడు దీపక్ సూద్ సూచించారు. అలాగైతేనే సరసమైన ధరలకు బీమా ఉత్పత్తులను విక్రయించవచ్చని, లాభాలనూ పెంచుకోవచ్చని అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ‘ఇన్సూర్ఇండ్’ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. పంపిణీ, పాలనాపరమైన అధిక ఖర్చులతో బీమా రంగం కుదేలవుతున్నదని అభిప్రాయపడ్డారు. తప్పుడు బీమా ఉత్పత్తుల విక్రయాలు కూడా తగ్గాలన్న ఆయన.. ఈ అంశంపై తక్షణమే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ సందర్భంగా విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోనూ బీమా పరిశ్రమ మితిమీరి పెడుతున్న ఖర్చులపై ఆందోళన వ్యక్తమైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో సూద్ వ్యాఖ్యలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయిప్పుడు.