పటాన్చెరు, సెప్టెంబర్ 19: కొత్తగా ఏర్పాటైన ఇంద్రేశం మున్సిపాలిటీని సమస్యలు పీడిస్తున్నాయి. ఈ మున్సిపాలిటీకి నిధులు లేకపోవడంతో పాటు సిబ్బంది నియామకం జరగక పోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీకి కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం, ఇతర శాఖల పర్యవేక్షణకు అధికారులు, సిబ్బందిని నియమించక పోవడంతో పనులు కావడం లేదు. డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు వారంలో రెండు సార్లు వచ్చి వెళ్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇందేశం గ్రామ పంచాయతీని ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాలిటీలో ఇంద్రేశం, ఐనోల్, బచ్చుగూడ, రామేశ్వరంబడ, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల గ్రామాలను విలీనం చేసింది.
మున్సిపాలిటీలో 18 వార్డులు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పర్యవేక్షణకు అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 6 గ్రామ పంచాయతీలను ఇంద్రేశం మున్సిపాలిటీలో ప్రభుత్వం విలీనం చేయడంతో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యం, తాగునీటితో పాటు ఇతరు పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో పాలన సాగించేందుకు కమిషనర్‌తో పాటు మేనేజర్, రెవెన్యూ, డీఈ, ఏఈ ఇంజినీరింగ్ అధికారులు , టీపీఎస్, అకౌంట్స్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్,హెల్త్ అసిస్టెంట్‌తో పాటు పలు విభాగాలకు సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం కమిషనర్ పోస్టు మాత్రమే భర్తీచేసింది. కానీ, మేనేజర్, ఇంజినీరింగ్ అధికారులు లేకపోవడంతో పక్క మున్సిపాలిటీల అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. 6 గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా చేసేందుకు 71 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మున్సిపాలిటీ భవనంలో సరైన సౌకర్యలు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమావేశం, సమీక్షలు చేసేందుకు సమావేశ మందిరం లేదు. కమిషనర్ కార్యాలయం చిన్న గది నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. పలు శాఖల అధికారులు పని చేసేందుకు భవనంలో స్థలం లేకపోవడంతో ఇబ్బందిగా మారింది.
ఇంద్రేశం మున్సిపాలిటీకి ఆర్ధిక వనరులు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో పాటు మున్సిపల్ పరిధిలో అధికారులు ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు, వాణిజ్య లైసెన్స్ జారీ, రెన్యునల్ , తైబజారు వేలం, జనరల్ ఫండ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు గ్రాంట్లకు ఎదురుచూస్తున్నారు. వార్డుల విభజన చేయడంతో పాటు పన్నులు వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. మున్సిపల్ కమిషనర్ ఒక్కరే ఉండడంతో ఆయనపై పనిభారం పడుతున్నది. ఇంద్రేశంలో పలు కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. పెద్ద, పెద్ద భవనాల నిర్మాణం జరిగింది. అపార్ట్మెంట్లు , వాణిజ్య భవనాలు వెలిశాయి. వాటి నుంచి పన్నులు వసూలు చేస్తే బల్దియాకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
కొత్తగా ఏర్పాటైన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. అభివృద్ధ్ది, సంక్షేమం, సేవలు అందించేందుకు సిబ్బంది లేక ఇబ్బందిగా ఉంది. పక్క మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులకు ఆదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పుగించింది. మేనేజర్, రెవెన్యూ పోస్టు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిం చాం. ఆరుగురు పంచాయతీ కార్యదర్శులు, 71 మంది ఇతర సిబ్బంది పనులు చేస్తున్నారు. 18 వార్డులు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వార్డులు విభజనకు చర్యలు తీసుకుంటున్నాం. భవనంలో సౌకర్యలు లేక ఇబ్బందులు పడుతున్నాం.
-మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఇంద్రేశం