లక్నో, సెప్టెంబర్ 16 : శునకాలు కరిస్తే శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రెచ్చగొట్టుడు లేకుండా వీధి కుక్కలు మనుషుల్ని ఒకసారి కరిస్తే దానికి 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించే శిక్ష విధిస్తారు. అదే రెండుసార్లు కనుక కరిస్తే ఇక దాని జీవిత కాలమంతా జంతు కేంద్రంలోనే గడపాలి. ఇది ఒక విధంగా మనుషులకు విధించే జీవిత ఖైదు లాంటిది. అయితే దానిని దత్తత తీసుకోవడానికి అంగీకరించి, ఇక ముందు దానిని వీధిలోకి విడిచిపెట్టమంటూ ఎవరైనా అఫిడవిట్ ఇస్తే శిక్ష విధించకుండా వారికి అప్పగిస్తారు. వీధి కుక్కల ఆగడాల నివారణకు యూపీ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ అభిజత్ అన్ని పట్టణ, గ్రామీణ పౌర సంస్థలకు ఈ మేరకు ఈ నెల 10న ఆదేశాలు జారీ చేశారు.
ఎవరైనా వ్యక్తి కుక్క కాటుకు గురై యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం వస్తే ఆ ఘటనను నమోదు చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని కరిచిన కుక్కను గుర్తించి మొదటి తప్పుగా 10 రోజుల శిక్ష విధిస్తారు. ఆ 10 రోజులు దాని ప్రవర్తనను గమనిస్తారు. తర్వాత దానికి మైక్రోచిప్ అమర్చి దాని కదలికలను నమోదు చేస్తారని ప్రయాగ్ రాజ్ వెటర్నరీ అధికారి బిజయ్ అమృత్ రాజ్ తెలిపారు. అదే కుక్క మరోసారి మనిషిని కరిస్తే ఇక దానికి జీవిత శిక్ష తప్పదని చెప్పారు. ఒక వేళ ఆ కుక్కను దత్తత తీసుకున్న వ్యక్తి దానిని వీధిలోకి విడిచిపెడితే ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.