లక్నో: బీజేపీ పాలిత యూపీ రాష్ట్రంలోని ఓటరు లిస్టుల్లో పలు అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని, మహోబా జిల్లాలోని ఒకే ఇంటిలో 4,271 మంది ఓటర్లు నమోదై ఉన్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహోబా జిల్లాలోని రెండు ఇళ్లలో 243, 185 ఓట్లు ఉన్నట్టు తాను సోమవారం చెప్పానని, కానీ అంతకన్నా షాకింగ్ విషయాన్ని తాను తాజాగా కనుగొన్నానన్నారు.
అదే జిల్లాలోని మరో ఇంటిలో 4,271 మంది ఓటర్లు నమోదై ఉన్నారని, ఓట్లే అన్ని ఉన్నాయంటే మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య 12 వేల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. వాస్తవానికి అధికార బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కుతో ఓట్ల చోరీ తొలుత యూపీలోనే ప్రారంభమైందని ఆయన ఆరోపించారు. అసాధారణమైన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. మహోబాలోనే కాదు రాష్ట్రంలోని పలు చోట్ల కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయని, తమ పార్టీ దానిని కూడా వెలికి తీస్తుందని చెప్పారు.