న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : ప్రధాని నరేంద్రమోదీ బుధవారం 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో అనధికారికంగా అమలవుతున్న ‘75 ఏండ్లకు రిటైర్మెంట్’ నిబంధనపై మరోసారి చర్చ జరుగుతున్నది. తన చిరకాల మిత్రుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ గత జూలైలో చేసిన వ్యాఖ్యలతోనే మోదీ వయసుపై చర్చ మొదలైంది. నాగపూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో భాగవత్ మాట్లాడుతూ హిందూత్వ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే మాటలను ఉటంకిస్తూ 75 ఏళ్లు వచ్చిన తర్వాత ఎవరైనా సరే అక్కడితో నడక ఆపేసి ఇతరులకు దారి ఇవ్వాలి. ఆ వయసులో ఎవరైనా శాలువా కప్పి సన్మానిస్తే ఇక పక్కకు తప్పుకోండి అని సూచించినట్లుగా భావించాలి అన్నారు. ఈ వ్యాఖ్యలు భాగవత్, మోదీ ఇద్దరూ మరో రెండు నెలల్లో 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా రావడం విశేషం.
సెప్టెంబర్ 11న భాగవత్ జన్మదినం కాగా సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం. భాగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించే చేసినట్లు పలువురు భావించారు. గతంలో 75వ సంవత్సరంలోకి ప్రవేశించిన పార్టీ సీనియర్ నేతలను వయో పరిమితి పేరుతో క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు తప్పించి ప్రయోజనం పొందిన నరేంద్ర మోదీ ఇప్పుడు అదే ప్రమాణాలను పాటిస్తారా అన్న ప్రశ్న ప్రతిపక్షాలనే కాక సామాన్య ప్రజలను సైతం వేధిస్తోంది. బీజేపీ లిఖితపూర్వకంగా అమలులోకి తెచ్చిన ఈ అనధికార నిబంధన కారణంగా 2013లో పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అస్త్ర సన్యాసం చేయవలసి వచ్చింది. అప్పుడు ఇదే మోహన్ భాగవత్ 2009 ఎన్నికలు మీ చివరి అవకాశమని అద్వానీకి చెప్పడంతో ఆ తర్వాత నుంచి అద్వానీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదని ప్రముఖ జర్నలిస్టు, నరేంద్ర మోదీ: ది మ్యాన్, ది టైమ్స్ అనే పుస్తక రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ ఫ్రంట్లైన్ పత్రికలో రాశారు. ఈ అనధికార నిబంధనే మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా చాటేందుకు మార్గాన్ని సుగమం చేసి 2014 విజయంతో అధికారంలో కూర్చోపెట్టింది.
ఆనాడు భాగవత్ చేసిన వ్యాఖ్యలను మోదీ మరచిపోయినా ప్రతిపక్షాలు మాత్రం మరచిపోలేదు. మోదీకి 75 ఏళ్లు పూర్తి అవుతున్నాయి. ఇక ఆయన ఎప్పుడు తప్పుకుంటారు? అసలు తప్పుకుంటారా, లేదా? ఇతరులందరినీ పక్కకు తప్పించిన మోదీకి తన పదవి ఎక్కడ పోతుందో అన్న ఆందోళన తప్ప దేశం ఏమై పోయినా పట్టలేదు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 75 ఏళ్ల వయసు దాటిన సీనియర్ నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడానికి బీజేపీ ఏర్పాటు చేసిన మార్గదర్శక్ మండల్ని కాంగ్రెస్కు చెందిన మరో సీనియర్ నాయకుడు అభిషేక్ మనూ సింఘ్వీ గుర్తు చేస్తూ మనం పాటించని నీతిని ఇతరులకు బోధించడం మహా పాపం అని వ్యాఖ్యానించారు.
పదవీ విరమణ వయసును తాము విధించామన్న ప్రతిపక్షాల వాదనను బీజేపీ తోసిపుచ్చింది. మోదీ రాజీనామా చేస్తారన్న చర్చను నిరాధార వదంతులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొట్టివేశారు. పింగ్లే మాటలను గుర్తు చేస్తూ తాను చేసిన వ్యాఖ్యలు నేరుగా ప్రధాని మోదీకే తాకడంతో భాగవత్ ఇటీవల వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. నా రిటైర్మెంట్ గురించి కాని మరెవరో రిటైర్మెంట్ గురించి కాని నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ వివరణ ఇచ్చారు.