ఇటానగర్, సెప్టెంబర్ 16 : తాము చదువుకుంటున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో టీచర్ల కొరతను నిరసిస్తూ విద్యార్థినులు అర్ధరాత్రి పాదయాత్ర చేపట్టారు. తమ పాఠశాలలో నెలకొన్న టీచర్ల కొరతను ఎత్తిచూపుతూ 65 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. నీలిరంగు పాఠశాల యూనిఫాంలో ఉన్న విద్యార్థినులు ఆదివారం న్యాంగ్నో గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించి, రాత్రంతా నడిచి.. సోమవారం ఉదయం జిల్లా ప్రధాన కార్యాలయం లెమ్మికి చేరుకున్నారు.
రాత్రి, ఉదయం వారు చేపట్టిన పాదయాత్ర వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉపాధ్యాయులు లేని పాఠశాల భవనం.. అనే బ్యానర్లను విద్యార్థినులు ప్రదర్శించటం సంచలనంగా మారింది. దీంతో భౌగోళిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం టీచర్లను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేయటం గమనార్హం.