టోక్యో: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ సర్వేశ్ కుశారె సత్తాచాటాడు. మంగళవారం జరిగిన పురుషుల హైజంప్ ఫైనల్లో కుశారె తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(2.28మీ) కనబరుస్తూ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సెంటీమీటర్ తేడాతో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారత హైజంపర్గా నిలిచిన కుశారె ప్రత్యర్థులకు దీటైన పోటీనివ్వడంలో సఫలమయ్యాడు.
నాసిక్(మహారాష్ట్ర)లోని సాధారణ ఉల్లిరైతు కుటుంబానికి చెందిన 30 ఏండ్ల కుశారె మెగాటోర్నీలో అంచనాలకు మించి రాణించాడు. 2022లో నమోదు చేసిన తన అత్యుత్తమ ప్రదర్శన(2.27మీ)ను తాజాగా మూడో ప్రయత్నంలో అధిగమించి ఔరా అనిపించాడు. అయితే 2.31మీటర్ల ఎత్తు దూకడంలో విఫలమైన కుశారె ముందంజ వేయలేకపోయాడు.
తొలి ప్రయత్నంలో 2.20మీటర్లు దూకిన కుశారె..ఆ తర్వాత 2.24మీటర్లు ఆ పై 2.28మీటర్లు ఎగిరేందుకు మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ ఫైనల్లో హమీశ్ కెర్ న్యూజిలాండ్), వు సాంగ్యోక్ కొరియా) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కెరీర్ తొలి నాళ్లలో గడ్డితో తయారు చేసిన మ్యాట్లపై ప్రాక్టీస్ చేసిన ఈ యువ అథ్లెట్ ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడే స్థాయికి ఎదిగాడు.