చిట్యాల,సెప్టెంబర్16: చిట్యాలలోని మన గ్రోమోర్ సెంటర్, ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన షాపులో నిల్వ ఉన్న ఎరువుల స్టాకును పరిశీలించారు. ఈ పాస్ మిషన్లో, స్టాక్ రిజిస్టర్ను చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల అమ్మకాల వివరాలను వెంటనే ఈపాస్ మిషన్లో , స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
యూరియా ఇతర ఎరువులను ఎమ్మార్పీ రేటును మించి విక్రయించినట్లు తెలిస్తే సదరు డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. రోజువారీ ఎరువుల లభ్యతను షాపుల్లోని బోర్డుపై రాసి అందరికీ కనపడేలా ప్రదర్శించాలన్నారు. మండల ప్రత్యేకాధికారి హోదాలో ఉరుమడ్లలోని జిల్లా పరిషత్ , మండల పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు సమతుల ఆహారాన్ని వారం పాటు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయలు, బియ్యాన్ని తనిఖీ చేశారు.