సైదాపూర్ సెప్టెంబర్ 7 : కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో వద్ద రెండో రోజు కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సుమారు 20 మంది పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణీ సాగింది. శనివారం పొద్దంతా 600కుపైగా రైతులు పడిగాపులు గాసి, నిరాశతో ఇండ్లకు వెళ్లగా.. ఆదివారం 300 మందికిపైగా తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. సింగిల్ విండోకు ఉదయం 5గంటల నుంచే తరలిరాగా, 7గంటల వరకు 600 మందికిపైగా బారులు తీరారు.
ముందుగా చెప్పులను క్యూలో పెట్టారు. రైతులు పెద్ద సంఖ్యలో రాగా, ఒక సీఐతోపాటు ఇద్దరు ఎస్ఐలు పర్యవేక్షించారు. పోలీసులతోపాటు వ్యవసాయశాఖ, సింగిల్విండో సిబ్బంది రైతులతో మాట్లాడారు. శనివారం టోకెన్లు తీసుకున్న రైతులకు ప్రస్తుతం యూరియా ఇస్తామని, లేనివారి పేర్లు నమోదు చేసుకుని తర్వాత లోడ్ వచ్చినపుడు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉదయం 7గంటల నుంచి ఏఈవోలు పేర్లు నమోదు చేసుకున్నారు. 9 గంటల నుంచి ఇది వరకు టోకెన్లు తీసుకున్న 330 మందికి మాత్రమే యూరియా ఒక్కో బస్తా చొప్పున అందజేశారు.