నిజామాబాద్, సెప్టెంబర్ 07, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద సృష్టించిన విలయ తాండవానికి భారీ ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. బీటీ రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకు పోవడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. ప్రస్తుతం నడక కూడా నరకప్రాయంగా మారింది. కంకర తేలిన రోడ్లపై టూ వీలర్, ఫోర్ వీలర్లతో ప్రయాణించడం గగనమైంది. ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇప్పటికే పలు చోట్ల పునరుద్ధరణకు నోచు కోలేదు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 మండలాల్లో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లు తీవ్రంగా నష్టం సంభవించింది. వీటి విలు రూ.20కోట్లు వరకు ఉంటుందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో వంతెనలతో సహా జాతీయ, రాష్ట్ర రహదారులు నామరూపాల్లేకుండా పోవడంతో నష్టం భారీగా ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలో రోడ్డు భవనాల శాఖ(ఆర్ అండ్ బి) రోడ్లు 65 కిలో మీటర్ల మేర ధ్వంసం అయ్యాయని అంచనాలు సిద్ధమయ్యాయి. 48 కల్వర్టులు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. వీటి మొత్తం విలువ సుమారుగా రూ.130 కోట్లు ఉంటుందని ఆర్ అండ్ బి అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇనేక చోట్ల ప్రస్తుతం తాత్కాలిక మరమత్తులు చేస్తున్నారు. బీటీ రోడ్లు దెబ్బతిన్న చోట మట్టి పోసి రాకపోకలకు అనువుగా మార్చుతున్నారు. వానలు లేకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. 11 రోజులవుతోన్న ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడలేదు. ముఖ్యమంత్రి పర్యటించి వెళ్లినప్పటికీ అంచనాల రూపకల్పనలోనే అధికార యంత్రాంగం నిమగ్నం అవ్వడం విడ్డూరంగా మారింది. సీఎం పర్యటనలో ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు వస్తాయని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేకుండా పోయింది.
నిజామాబాద్‌లో 5 మండలాల్లో దెబ్బతిన్న రోడ్లు…
నిజామాబాద్ జిల్లాలో వరద సృష్టించిన విధ్వంసంలో ప్రధానంగా 5 మండలాల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. బోధన్, భీంగల్, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో వరద ఉధృతికి ఆర్అండ్బి, పీఆర్ రోడ్లు చిన్నాభిన్నమయ్యాయి. పలు చోట్ల కోతకు గురవ్వడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేటికీ భారీ వాహనాలు వెళ్లడం ఇబ్బందిగానే మారింది. ఇందల్వాయి మండలంలో జాతీయ రహదారి 44 – గన్నారం, తిర్మన్‌పల్లి – రాంపూర్, తిర్మన్‌పల్లి – ధర్పల్లి, ఎల్లారెడ్డిపల్లి – లోలం, అన్సన్‌పల్లి – సిర్నాపల్లి రోడ్లు ధ్వంసమయ్యాయి. నష్టం విలువ రూ.1కోటి వరకు ఉంటుందని అంచనా. సిరికొండ మండలంలో రూ.4కోట్లు మేర రోడ్లు కోతకు గురయ్యాయి.
పెద్దవాల్గోట్ – చిన్నవాల్గోట్, తూంపల్లి – భీంగల్, సిరికొండ – వేములవాడ, హొన్నాజిపేట్ – కొండాపూర్, ధర్పల్లి – భీంగల్ మధ్య సమస్య ఏర్పడింది. ధర్పల్లి మండలంలో సుమారుగా రహదారులకు రూ.2కోట్లు నష్టం వాటిల్లింది. మద్దుల్ ఎక్స్ రోడ్డు – గడ్కోల్, హొన్నాజిపేట్ – బీరప్పాతండా – కొటాలపల్లి, ఇందల్వాయి – భీంగల్, ఎల్లారెడ్డిపల్లి – ప్రాజెక్టు రామడుగు, ప్రాజెక్టు రామడుగు – కేసారం దుబ్బాక – రేకులపల్లి పోతునూర్, యానంపల్లి – ప్రాజెక్టు రామడుగు వరకు డ్యామేజీ చోటు చేసుకుంది. బోధన్ పాత మండలం పరిధిలో సిద్ధాపూర్ – ఖండ్గామ్, హంగర్గా – కొప్పర్గా, హున్సా గ్రామంలో అంతర్గత రోడ్లు దెబ్బతిన్నది. భీంగల్ మండలంలో రూ.3కోట్లు వరకు కిలోమీటరన్నర వరకు ఆర్ అండ్ బి బీటీ రోడ్డు నష్టం వాటిల్లగా, పంచాయతీ రాజ్ పరిధిలో రూ.1కోటి వరకు మూడు కల్వర్టులు, పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి.
కామారెడ్డిలో అపారనష్టం…
నాగిరెడ్డిపేట మండలంలో పోచారం, బంజారా గ్రామాల మధ్య జాతీయ రహదారి 765డి కొట్టుకు పోయింది. దీంతో హైదరాబాద్ ప్రయాణాలు కష్టమవ్వగా తాత్కాలికంగా మట్టి రోడ్డుతో రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. చీనూర్ – గోపాల్పేట బీటీ రోడ్డు, గోపాల్పేట-నాగిరెడ్డిపేట, వెంకంపల్లి-ధర్మారెడ్డి మధ్య తీవ్రంగా రోడ్లు దెబ్బతిన్నాయి. బీబీపేట మండలంలో జనగామ-మాందపూర్, బీబీపేట-ఉప్పరపల్లి, తుజాల్పూర్ – బీబీపేట, యాడారం-బీబీపేట,జనగామమర్రి-అంబారిపేట, మాందాపూర్ – సంగమేశ్వర్ మధ్య ఘోరమైన దుస్థితి ఉంది.
మాచారెడ్డి మండలంలో పాల్వంచ – దోమకొండ, భవనానిపేట-పోతారం-సింగారాయపల్లి, పాల్వంచ- ఫరీద్‌పేట, చుక్కాపూర్-బండరామేశ్వరపల్లి, లచ్చాపేట-బండరేమేశ్వరపల్లి, పాల్వంచ బ్రిడ్జి ధ్వంసమైంది. రాజంపేట మండలంలో కొండాపూర్-ఆరుగొండ, కొండాపూర్ నుంచి ఎల్లారెడ్డిపల్లి మార్గంలో మధ్య రెండు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. రాజంపేట-పెద్దాయపల్లి, రాజంపేట- శివాయిపల్లి మధ్య కోసుకపోయిన రోడ్లు. భిక్కనూర్ మండలంలో భిక్కనూర్-అంతంపల్లి, భిక్కనూర్- లక్ష్మీదేవిపల్లి, భిక్కనూర్ – గుర్జాకుంటా మధ్య ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
లింగంపేట మండలంలో పాముల వాగు వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు మెరుగుపడలేదు. కాసులకట్ట వంతెన, పోల్కంపేటలో లో లెవెల్ బ్రిడ్జి దెబ్బతిన్నది. నిజాంసాగర్ పాత మండలంలో బొగ్గుగుడిసె వద్ద రోడ్డు తీవ్రంగా ధ్వంసమవ్వడంతో హైదరాబాద్ – బోధన్ బస్సులు నిలిచిపోయాయి. మంజీరా నదిపై చిన్నాపూర్ వద్ద వంతెన కొట్టుకు పోయింది. ఎల్లారెడ్డి మండలంలో కామారెడ్డి వెళ్లే దారిలో పోచంపల్లి శివారు, అడవిలింగాల శివారు, కొట్టాల్ వద్ద రోడ్డు తెగిపోగా మట్టితో చక్కబెట్టారు. బిచ్కుంద మండలంలో బండరెంజల్ – శాంతాపూర్, చిన్నదేవడ గేట్ – చిన్నదేవడ డ్యామేజీ చోటు చేసుకుంది. చిన్నదడ్గి – పెద్ద దడ్గి బ్రిడ్దిపై చువ్వలు తేలాయి.
బస్సులు ఇంకా వస్తలేవు..
ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 7: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు ఇంకా పూర్తిగా బాగుచేయలేదు. పదిరోజుల దాక రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. కానీ చిన్న వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తుండగా, బస్సులు ఇంకా ప్రారంభం కాలేదు. రోడ్లు మంచిగ లేవని, రాకపోకలకు ఇబ్బంది అయితదని ముఖ్యమంత్రి ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయినట్లు తెలిసింది. బస్సులు రాక 13 రోజులవుతున్నది.
– ఆదిమూలం సతీశ్‌కుమార్, వికలాంగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు, ఎల్లారెడ్డి
చుట్టూ తిరుగుకుంటా పోవాల్సి వస్తుంది..
ఎల్లారెడ్డి మండలం పోసానిపల్లి శివారులోని ఒడ్డెగుడిసెల వద్ద, డిగ్రీ కళాశాల సమీపంలోని బ్రిడ్జి మూలమలుపు వద్ద, కొట్టాల్ మూలమలుపు వద్ద రోడ్లు కొట్టుకుపోయినయ్. అధికారులు ఆగమాగం మొరం పోసి నింపారు. అది కూడా పది రోజులు పట్టింది. అప్పటిదాక పల్లెల చుట్టూ తిరిగి కామారెడ్డికి పోవాల్సివచ్చింది. మొత్తం మొరం పోయడంతో బస్సులు, పెద్ద వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి.
– ముత్యాల శ్రావణ్‌కుమార్, గండిమాసానిపేట్
కొట్టుకుపోయిన రహదారులపై నిర్లక్ష్యం
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 7: భారీ వరదలతో పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న వంతెన వద్ద మూడు చోట్ల, గోపాల్పేట, బంజారా గ్రా మాల వద్ద నూతన హైవే 765డీపై రహదారి పూర్తిగా 100 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. 12 రోజులు అవుతున్నా కనీసం మట్టి పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు రోడ్డుపై వెళ్లడానికి ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ
పట్టించుకొనే వారు లేరు
భారీవర్షాలతో ప్రధాన రహదారులు, గ్రామాల బీటీ రోడ్లు పూర్తిగా కోతకు గురై వరదలకు కొట్టుకుపోయాయి. సీఎం రేవంత్‌రెడ్డి మండలానికి వస్తున్నాడని తెలపడంతో..పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి తక్షణ మరమ్మతుల కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడ్తారని ఆశపడ్డాం. అనుకున్నది ఏమీ జరగలేదు. ముఖ్యమంత్రి రాలేదు. 12 రోజులు అవుతున్నా కనీసం మట్టి పనులు ఇప్పటికీ పూర్తి చేయడం లేదు. పట్టించుకున్న నాథుడే లేడు.
– టేకుల పల్లి దుర్గారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, నాగిరెడ్డిపేట
నిధులు మంజూరు చేయాలి
లింగంపేట, సెప్టెంబర్ 7: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపల్లి గ్రామ సమీపంలోని పాముల వాగు వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రైతులు ఎరువుల కొనుగోలు కోసం మండల కేంద్రానికి రావడానికి అవస్థలు పడుతున్నారు.
– దివిటి రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు