వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా మాటలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో పంటలకు 9గంటల నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతున్నది. 12గంటల విద్యుత్ సరఫరాలోనూ కోతలు విధిస్తున్నది. దీంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. త్రీఫేజ్ కరెంటు పదేపదే ట్రిప్ అవుతుండడంతో బోరుమోటర్లు కాలిపోతున్నాయి. ఒక్కో బోరుమోటర్ మరమ్మతుకు రైతులు రూ.5వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. కరెంటు కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో రైతులు నష్టపోతుండడమే కాకుండా బోరుమోటర్లు కాలిపోయి మరింత ఇక్కట్ల పాలవుతున్నారు. సరిపడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.
సంగారెడ్డి, మార్చి 15(నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మాట తప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతుండడంతో ఆందోళనలకు సిద్ధవుతున్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఇటీవల సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌ను పరిశీలించి కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 12గంటలు విద్యుత్ సరఫరా కూడా సరిగ్గా చేయక పోవడంపై రేవంత్ సర్కార్‌పై ఆయన మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో పంటలకు 12గంటలలోపే విద్యుత్ సరఫర అవుతున్నది. దీంతో బోరుబావుల కింద పంట లు ఎండిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1.10 లక్షల వ్యవసాయ విద్యు త్ కనెక్షన్లు ఉన్నాయి. యాసంగిలో రైతులు బోరుబావుల కింద వరి, చెరుకు, మొక్కజొన్న, పొ ద్దుతిరుగుడు, కూరగాయల పంటలు సాగుచేశారు. ఈ యా సంగిలో సంగారెడ్డి జిల్లాలో 2,38,018 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఇందులో ప్రధానంగా రైతులు బోరుబావుల కింద 1,03,243 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 10వేల ఎకరాల్లో చెరుకు, మరో 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగుచేశారు. రూ.20 వేల ఎకరాల వరకు బోరుబావుల కింద ఆలుగడ్డ, మిర ప, బీన్స్ తదితర కూరగాయల పంటలు సాగు చేశారు.
బోరుబావుల కింద పంటలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం కరెంటు కోతలతో ఇక్క ట్లు పడుతున్నారు. కరెంటు కోతల కారణంగా నీరందక వరి, చెరుకు పంటలు ఎండిపోతున్నా యి. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, అందోల్, పుల్కల్, వట్పల్లి, మునిపల్లి, కల్హేర్, కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. పంటలకు కేవలం 9నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతున్నది. చాలా ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు పంటలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతున్నది. కొన్ని ప్రాంతా ల్లో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా అవుతున్నది. 9నుంచి 12గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా కావడం లేదు. మధ్యలో మూడు నుంచి నాలుగుసార్లు ట్రిప్ అవుతుం డగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
తగ్గిన పంటల సాగు..కోతలతో ఎండిపోతున్న పంటలు
సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో రైతులు 2 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేసేవారు. ప్రస్తుతం 1.03 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట వేశారు. వరిసాగు గణనీయంగా తగ్గింది. బోరుబావుల కింద 15నుంచి 20వేల వరకు చెరుకు సాగు అయ్యేది. ప్రస్తుతం 8626 ఎకరాలకే చెరుకు సాగు పరిమితమైం ది. సింగూరు ప్రాజెక్టుతో పాటు బోరుబావుల కింద 20వేల ఎకరాలు, నల్లవా గు ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల్లో వరి పంటను పండించేవారు. మరమ్మతుల కారణంగా సింగూరు ప్రాజెక్టు కింద ప్రభుత్వం క్రాప్ హాలి డే ప్రకటించింది. దీంతో యాసంగిలో కాల్వల కింద రైతులు వరి, ఇతర పంటలు వేయలేదు. బోరుబావుల కింద వరిసాగు గణనీయంగా తగ్గింది. పుల్కల్, చౌటకూరు మండలాల్లో రైతు లు 16వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. 4వేల ఎకరాల మేర వరిసాగు తగ్గింది. నల్లవాగు ప్రా జెక్టు కింద యాసంగిలో 5వేల ఎకరాలు రైతు లు సాగుచేసేవారు. ప్రస్తుతం 2875 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వరిసాగు తగ్గగా, కరెంటు కోతల కారణంగా ఉన్న వరి పొలాలు ఎండిపోతున్నాయి. పుల్కల్, చౌటకూరు, నాగల్గిద్ద, కల్హేర్, కంగ్టి మండలాల్లో కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయి.
లోవోల్టేజీ.. పదేపదే ట్రిప్
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి అరకొర విద్యుత్ సరఫరా చేస్తున్నది. త్రీఫేజ్ కరెంటు పదేపదే ట్రిప్ అవుతున్నది. ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ కావటంతో బోరుమోటర్లు కాలిపోతున్నాయి. ఓవర్ లోడ్‌తో లోవోల్టేజీ, పదేపదే కరెంటు ట్రిప్ కావడంతో స్టార్టర్లు, బోరుమోటర్లు కాలిపోయి రైతులకు ఆర్థిక భారం పడుతున్నది. కాలిపోయిన మోటర్లు పైకితీయడం, మెకానిక్ వద్దకు తీసుకెళ్లడం, మరమ్మతులు చేయించడానికి రైతులకు రూ.4 నుంచి రూ.5వేలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు మార్చటానికి విద్యుత్ శాఖ అధికారులు రూలింగ్ పాటించడం లేదు. విద్యుత్‌శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ట్రాన్స్ఫార్మర్లు మార్చడంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నది. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయి.