మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్/సిర్పూర్(యు)/దహెగాం, మార్చి 15 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతుండడంతో సాగుకు నీరు అందక పంటలు వట్టిపోతున్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావరి.. ప్రస్తుతం నీళ్లు లేక వట్టిపోయింది. దీంతో పంటలకు నీరు అందించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి పక్కనే ఉన్న సీతారాంపల్లి, తాళ్లపల్లి గ్రామాల రైతులు సాగు నీటి కోసం భగీరథయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు దిగువన ఉన్న సుందిళ్ల బ్యారేజ్‌లో నీళ్లు ఆపితే.. మంచిర్యాల గోదావరి నిండు కండులా ఉండేది. దీంతో సీతారాంపల్లి, తాళ్లపల్లి గ్రామాల్లో దాదాపు కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందేది. ఎక్కడో మేడిగడ్డ కుంగిందని సుందిళ్లలోనూ నీళ్లను ఆపకుండా దిగువకు వదిలేస్తుండడంతో రెండేళ్లుగా మంచిర్యాల గోదావరిలో నీరు లేకుండా పోయింది. దీంతో ఎల్లంపల్లి నుంచి పాయలా వచ్చే కొద్దిపాటి నీటిని ఒడిసిపట్టి పంటలను కాడుకునేందుకు రైతులు నడుంబిగించారు.
నీటిని పొలాలకు తరలించుకునేందుకు దాదాపు కిలోమీటరున్నర సొంత డబ్బులతో కాలువ తవ్వుకున్నారు. సుమారుగా 40 మంది రైతులు ఎకరానికి రూ.1500 చొప్పున జమ చేసి జేసీబీ సాయంతో గోదావరిలో కాలువ తవ్వించారు. ఆ కాలువ గుండా వచ్చే నీటిలో మోటార్లు వేసి గోదావరి గట్టు పక్కనున్న కొద్ది పాటి ఎకరాల్లోని పొలాలకు మళ్లించుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలోనే పెద్దదైన రాఘాపూర్ చెరువు అడుగంటింది. వర్షాకాలంలో నిండే ఈ చెరువు నీటిని కేవలం యాసంగి పంటకే ఇక్కడి రైతులు ఉపయోగిస్తారు. కానీ.. ఈ ఏడాది ఈ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక చెరువులోకి నీరు రాలేదు. దీంతో యేట యాసంగికి 1000 ఎకరాలు సాగు చేసే రైతులు ఈసారి 200 ఎకరాల్లోనే పంటలు వేసుకున్నారు. ఆ పంటలకూ సరిపడా నీళ్లు అందక పశువులకు గ్రాసంగా వదిలేశారు.
గతంలో ఎండాకాలంలోనూ నిండుకుండాలా ఉంటే రాఘాపూర్ చెరువులో నీరు లేక ఈసారి సాగు చేయకపోయామని రైతులు వాపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని చంద్రపల్లి గ్రామంలోని ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మండలంలోని పీపీ రావు ప్రాజెక్ట్‌లో నీళ్లున్నప్పటికీ ఆయకట్టుకు అందడం లేదు.
చంద్రపల్లి పొలాలకు డీ-3 కెనాల్ నుంచి నీళ్లు వస్తాయని ఆశతో వరి వేస్తే.. డీ-3 కెనాల్లో పిచ్చిమొక్కలు మొలవడం, తూములు సరిగా లేకపోవడంతో ఆయకట్టుకు రావాల్సిన నీళ్లు.. వృథా గా ఎర్రవాగులో కలిసిపోతున్నాయి. నీటి పారుదల శాఖ అ ధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారిందని రైతు లు ఆరోపిస్తున్నారు. ఇప్పకైనా కెనాల్‌ను బాగు చేసి నీరందించాలని వేడుకుంటున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఎండల తీవ్రత పెరిగితే పంటల పరిస్థితి ఏంటంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దహెగాం మండలంలో పిచ్చి మొక్కలతో నిండిన పీపీ రావు ప్రాజెక్ట్ డీ-3 కెనాల్

దహెగాం మండలంలోపీపీ రావు ప్రాజెక్ట్ నీళ్లు అందక ఎండిన వరి పైరు

పంటల మధ్యలో వదిలి వేసిన చేలలో మేస్తున్న పశువులు

సిర్పూర్(యు) మండలంలోని రాఘాపూర్ చెరువు కింద నాకు ఐదెకరాల భూమి ఉంది. వర్షాకాలం పంటను మాత్రమే వేస్తా. యాసంగి పంటను మాత్రం రాఘాపూర్ చెరువు నీళ్లతోనే పండిస్తా. ఈ ఏడాది కూడా రాఘాపూర్ చెరువు కింద జొన్న సాగు చేశా. కానీ.. నీళ్లు అందక పోవడంతో పంట ఎండింది. రెండెకరాలను పశువులకు వదిలేశా. కాలువ ద్వారా నీళ్లు రావడం లేదు.
-గోవింద్రావు, రైతు, సిర్పూర్(యు)
మాది మంచిర్యాల జిల్లా సీతారాం పల్లి. గోదావరి ఒడ్డున నాకు మూడెకరాలు ఉంది. గోదావరిలో నీళ్లు లేక దాదాపు కిలోమీటరున్నర ముందు నుంచి కాలువ తవ్వుకున్నం. ఎకరాకు రూ.1500 చొప్పున పోగేసి కాలువ తీసి, మోటార్లతో పొలాలు తడుపుకుంటున్నం. రెండేళ్ల క్రితం వరకు గోదావరిలో పుష్కలమైన నీళ్లు ఉండే. సుందిళ్లలో నీళ్లు ఆపితే ఇక్కడి దాకా తట్టేవి. ఇప్పుడు గోదావరి మొత్తం ఎండిపోయి గోసపడుతున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇలాగే కాలువ తవ్వుకున్నం. ఈ కాలువ కిందనే 150 నుంచి 200 ఎకరాలు సాగు కావాలి. ఎండలు పెరిగితే నీరు సరిపోయేలా లేదు. ఏం చేసుడో అర్థం అయితలేదు. పొట్టదశకు వచ్చాక నీళ్లు అందకపోతే.. పడిన రెక్కల కష్టం వృథా అయిపోతది. మా పొలాల కోసమన్నా ఎల్లంపల్లి నుంచి కొంత నీరు కిందకు వదిలితే బాగుంటది.
– మేకల మల్లేశ్, రైతు, సీతారాంపల్లి.
నాకు దహెగాం మండలంలోని చంద్రంపల్లిలో మూడెకరాల భూమి ఉంది. పక్కనే ఉన్న పీపీ రావు ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉన్నా.. మా పొలాలకు అందడం లేదు. నీళ్లు ఇవ్వాల్సిన డీ-3 కెనాల్ పూర్తిగా పిచ్చి మొక్కతో నిండి, తూములు సరిగా లేక నీళ్లన్నీ ఎర్రవాగులో కలిసి వృథాగా పోతున్నాయి. నీళ్లను సరిగా వదలడం లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ, అందక పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటికే దాదాపు సాగు కోసం రూ.80 వేలు ఖర్చు చేశా. పొలంకాడికి పోయి చూసినప్పుడల్లా గోస అనిపిస్తున్నది.
– దర్గం బాపు, చంద్రపల్లి, దహెగాం.
నాకు సిర్పూర్(యు)లోని రాఘాపూర్ చెరువు కింద ఆరెకరాల భూమి ఉంది. యేటా నేను రాఘాపూర్ చెరువు నీళ్లతోనే యాసంగి పంట తీస్తా. ఈ యేడాది చెరువులో నీళ్లు లేకపో వడంతో సాగు చేయలేదు. చెరువులో ఉన్న కొద్దిపాటి నీటిని నమ్ముకొని యాసంగి సాగుచేసే పరిస్థితి లేదు. ఈ చెరువు కింద సాగు చేసిన రైతులు కొంత మంది తమ పంటను పశువులకు వదిలేస్తున్నారు.
-లింబారావు, రైతు, సిర్పూర్(యు)