హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో సకల హంగులతో కళకళలాడిన గురుకులాలు, రేవంత్ పాలనలో అస్తవ్యస్తంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2,500మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలివ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఉపాధ్యాయ దినోత్సవం రోజు పేపర్లు, టీవీల్లో ఆడంబరంగా ప్రకటనలు ఇవ్వడంకాదు.. వారికి సకాలంలో జీతాలు చెల్లించు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్‌చేశారు. విషజ్వరాలు, పాములు, ఎలుకల కాట్లతో విద్యార్థులు దవాఖానలపాలై ప్రాణాలుపోయే దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.
‘గురుకులాలను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పిన సీఎం మాటలు నీటిమూటలయ్యాయి. కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతానని చెప్పిన ఢాంబికాలు గాలిలో కలిసిపోయాయి.’అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకుల వ్యవస్థ, రేవంత్‌రెడ్డి హయాంలో అధోగతి పాలైందని దుయ్యబట్టారు. రోజుకోచోట విద్యార్థుల మరణాలతో నరకకూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాడు 294 ఉన్న గురుకులాల సంఖ్యను 1,024కు, 1.90 లక్షల విద్యార్థుల సంఖ్యను 6 లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు.
నాడు గొప్పగా వెలుగొందిన గురుకులాలు.. కాంగ్రెస్ 22 నెలల పాలనలో కునారిల్లుతున్నాయని ఆవేదన్య వ్యక్తంచేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు చదివే విద్యాలయాలపై ఎందుకంత చిన్నచూపు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి గాడితప్పిన గురుకులాలపై శ్రద్ధ చూపాలని చురకలంటించారు. వెంటనే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌చేశారు.