టోక్యో: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఆదివారం పదవి నుంచి వైదొలిగారు. ఎన్నికల్లో వరుస పరాజయాలు, మెజార్టీని నిలబెట్టుకోవడంలో విఫలమైన క్రమంలో పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వారసుడు ఎవరన్న దానిపై అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ‘లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.
అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాల్సిందిగా సెక్రటరీ జనరల్ మోరియామాను కోరాను’ అని ఇషిబా తెలిపారు. 68 ఏండ్ల ఇషిబా గత ఏడాది అక్టోబర్లోనే ప్రధాని పదవిని చేపట్టారు. ఎన్నికల్లో పార్టీ వరుస పరాజయాలతో ఆయన నాయకత్వంపై అసంతృప్తి పెరిగింది. రాజీనామా డిమాండ్లు పెరగడం, అవిశ్వాస తీర్మానం తేవాలన్న ప్రతిపాదన కూడా రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.