వర్షాలు ఇలా తగ్గుముఖం పట్టాయోలేదో ‘జ్వర’ కుంపట్లు రాజుకున్నాయి. వాతావరణంలో మార్పులతో అంతటా విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లతో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ దవాఖానలకు ప్రజలు పరుగులు తీస్తుండగా, అంతటా ఓపీ ఒక్కసారిగా పెరిగింది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తాకిడి రెట్టింపైంది. ఇదే సమయంలో పలు ప్రైవేట్ హాస్పిటళ్లు రోగులకు చుక్కలు చూపుతున్నాయి. సాధారణ జ్వరానికి సైతం వైద్య పరీక్షలు, చికిత్సల పేరిట వేలకు వేలు గుంజుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా నయంకాకపోవడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సేవలు మెరుగు పరచడంతో పాటు ప్రైవేటు వైద్యశాలలపై నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతంగా ప్రబలుతున్నాయి. ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లతో జనం బాధపడుతున్నారు. అక్కడక్కడగా డెంగీ బారిన కూడా పడుతున్నారు. జ్వరాలు పెరగడంతో దవాఖానలు రోగులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి. ఏ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను చూసినా రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్‌లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు తాకిడి పెరుగుతున్నది.
కరీంనగర్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి జ్వరపీడితులు వస్తుండగా, సాధారణ సమయంలో 800 నుంచి వెయ్యి మంది ఓపీ ఉంటున్నది. ఇప్పుడది 1,200 నుంచి 1,300కు చేరింది. అందులో ఎక్కువగా వైరల్ ఫీవర్ బాధితులే ఎక్కువగా ఉంటుండగా, జ్వరపీడితుల కోసం ప్రత్యేకంగా ఫీవర్ వార్డు ఓపెన్ చేశారు. ప్రతి రోజు 450కిపైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. గతానికి ఇప్పటికి ఓపీ చూపించుకునే వారి సంఖ్య రెట్టింపైంది. అయితే పలుచోట్ల సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పడకలు సరిపోవడం లేదని వాపోతున్నారు. కాగా, కరీంనగర్ జిల్లాలో గత నెల 72 డెంగీ కేసులు నమోదు చేశారు.
పలు ప్రభుత్వ దవాఖానల్లో సేవలు అంతంతే అందుతున్నట్టు తెలుస్తుండగా, జ్వర పీడితులు ప్రైవేట్ దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ దవాఖానలు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయనే బాధితులు ఆరోపిస్తున్నారు. మామూలు జ్వరంతో వెళ్లినా రకరకాల పరీక్షలు చేయిస్తున్నారని, అవసరం లేకున్నా అడ్డగోలు పరీక్షలు చేయిస్తున్నారని అందినకాడికి దండుకుంటున్నారని వాపోతున్నారు. ప్రైవేట్‌లో చికిత్స కంటే పరీక్షలకే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, మామూలు వైద్య పరీక్షలకు కూడా వేలకు వేలు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పరీక్షలన్నీ చేసిన తర్వాత తీరా మామూలు జ్వరమే అని వైద్యులు చెబుతున్నారని చెబుతున్నారు. అయినా ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందినా జ్వరాలు తగ్గక పోవడంతో కొందరు తిరిగి ప్రభుత్వ దవాఖానలకు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ దవాఖానలు విచ్చల విడిగా దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు విజృంభించడానికి పారిశుధ్యలోపమే కారణమని తెలుస్తున్నది. గతంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టే వారు. ప్రస్తుతం పంచాయతీలకు పాలకవర్గం లేక పోవడం, నిధులు కూడా లేక పోవడంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోతున్నది. మురుగుకాలువలు అధ్వానంగా మారుతున్నా శుభ్రం చేసే పరిస్థితి లేదు. అనేక గ్రామాల్లో ట్రాక్టర్లు మూలన పడిపోవడంతో పారిశుధ్యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెందడంతోపాటు కలుషిత నీరు, శుభ్రతలేని ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే దవాఖానకు పరుగులు తీస్తున్నా, పలు పీహెచ్‌సీల్లో సరైన చికిత్స లభించక జిల్లాకేంద్రాల్లోని దవాఖానలకు వెళ్తున్నారు. అయితే ఇన్పెషేంట్లకు సరిపడా పడకలు ఉండడం లేదని, పూర్తి స్థాయి సేవలందడం రోగులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొందరు ఆర్ఎంపీ, పీఎంపీల వద్దకు లేదంటే ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్తున్నా, అక్కడ దోపిడీకి తట్టుకోలేకపోతున్నారు.
పదిహేను రోజుల సంది మూడు ప్రైవేట్ హాస్పిటళ్లు తిరిగిన. వైద్య పరీక్షలకు వేల రూపాయలు పెట్టిన. మందులు వాడిన. అయినా జ్వరం తగ్గుత లేదు. దగ్గు జ్వరం నీరసంగా ఉంది. చివరికి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు వచ్చిన. ఇకడ రెండు రోజుల్లోనే జ్వరం తగ్గింది. రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అందింది.
-మసూద్ ఖాన్, రేకుర్తి
నేను మూడు రోజుల సంది జ్వరంతో బాధపడుతున్నా. తలనొప్పి విపరీతంగా ఉన్నది. మా ఊర్లో స్థానిక వైద్యులకు చూపించినా. తగ్గకపోవడంతో ఇకడికి వచ్చినా. వైద్యులు వైరల్ ఫీవర్ అని చెప్పారు. ఇకడికి రాగానే వైద్యులు చికిత్స అందించారు. ఇప్పుడు కొంచెం రిలాక్స్‌గా ఉన్నది.
– ప్రజ్ఞ శ్రీ, అన్నారం
వైరల్ ఫీవర్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జ్వర పీడితుల కోసం సెపరేట్ వార్డును ఏర్పాటు చేశాం. సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రక్త పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి ప్లేట్లెట్స్ సైతం అందిస్తున్నాం. జ్వరం ఎకువగా ఉంటే పారాసిటమాల్ వేయాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలి. దవాఖానలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
– గుండా వీరారెడ్డి, జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ (కరీంనగర్)
జీజీహెచ్‌లో ఓపీ సంఖ్య రెట్టింపైంది. రోజుకు 200 మందికి పైగా జ్వరాలతో వస్తున్నారు. అన్ని రకాల జ్వరాలకు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నాం. కలుషిత ఆహారంతోపాటు కలుషిత నీరు తీసుకోవడంతోనే వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వైరల్ ఫీవర్ వచ్చిందంటే రెండు వారాలపాటు నీరసంగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
– బాలే సుధాకర్, ఆర్ఎంవో (కరీంనగర్)