Rajanna Siricilla | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 07 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న పెన్షన్లు పెంచడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి పుట్ట రవి మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో పెన్షన్‌దారులను కలిసి, కలెకర్టేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు రావాలని వారు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని హామీనిచ్చారన్నారు. ఇచ్చిన హమీల ప్రకారం దివ్యాంగులకు రూ.8 వేలు, వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, చేయూత పెన్షన్లను రూ. 4 వేలు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సీఎం వైఖరికి నిరసనగా ఈనెల 8న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం ఎదుట పెన్షనారులతో కలిసి పెద్ద ఎత్తున మహాధర్నాచేపడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య, ఎమ్మార్పీఎస్ నేతలు, పెన్షన్‌దారులు, మహిళలు, బీడీ కార్మికులు తదితరులు ఉన్నారు.