Asha Workers | హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమకు రూ. 18 వేలు ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని ఆశా వర్కర్లు కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఇవాళ మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ సర్కార్ పట్ల నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసాచారి కలిసి ఆశా వర్కర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. ఆ ఇద్దరిని పోలీసులు పట్టించుకోలేదు. చివరకు మిగతా ఆశా కార్యకర్తలు వారిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంతోష అనే ఆశా వర్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారికి వైద్యం అందిస్తున్నామని ఉస్మానియా డాక్టర్లు పేర్కొన్నారు.
ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు పరామర్శించారు. ఆశా వర్కర్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను బీఆర్ఎస్ నేతలు ఆదేశించారు. ఇక ఆశా వర్కర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసుల తీరును బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఏసీపీ, సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యామా..? సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
Group-2 Hall Tickets | గ్రూప్-2 హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో తప్పనిసరి.. నిబంధనలు ఇవే..!
Harish Rao | ఆశా వర్కర్లపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు