లండన్: ఉన్నత చదువుల కోసం బ్రిటన్ (Britain) వెళ్లాలనుకునే వారికి చేదువార్త. ఇకపై అక్కడి చదువు మరింత భారం కాబోతున్నది. యూకే యూనివర్సిటీల్లో ఇకపై ట్యూషన్ ఫీజులు ఏటా పెరగబోతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ట్యూషన్ ఫీజును పెంచడమనే కొత్త విధానాన్ని వర్సిటీలు అమలుజేయబోతున్నాయి. 2026 నుంచి ఇది అమల్లోకి రాబోతున్నట్టు బ్రిటన్ విద్యామంత్రి ఫిలిప్సన్ ఆదేశ ఎంపీలకు వివరించారు.
త్వరలో చట్టాన్ని తీసుకొస్తున్నామని, వర్సిటీలు, కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ఈ సంస్కరణలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. ‘కోర్సుల ఫీజును వర్సిటీలే నిర్ణయిస్తాయి. అత్యధిక ఫీజు నిర్ణయించే హక్కు వాటికుంది’ అని ఫిలిప్సన్ అన్నారు. గత 8 ఏండ్లలో మొదటిసారి సెప్టెంబర్లో ట్యూషన్ ఫీజును 9,535 యూరోలకు పెంచారు. అయినప్పటికీ అదనంగా ఆర్థిక మద్దతు లేకుండా 43% యూనివర్సిటీలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు.