హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ఘనంగా ప్రకటనలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం చేసింది శూన్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గాలిమాటలతో గారడీ చేయడం తప్ప చేసిందేమీలేదని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ‘చిన్నపాటి వేతనజీవుల శ్రమ, కష్టాన్ని గౌరవించడం మీకు చేతగాదా? విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీకు మీ సొంతశాఖలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు కనిపించడంలేదా?.. మీ మాటల మాయజాలంతో ఎంతకాలం వారిని మోసగిస్తారు?’ అని ప్రశ్నించారు.
22నెలల కాంగ్రెస్ పాలనలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఉపాధ్యాయులు, ఉద్యోగులు..స్కావెంజర్ల లాంటి చిరుద్యోగులు వేతనాల కోసం నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపివేయడంపై దుయ్యబట్టారు. మధ్యాహ్నభోజన బిల్లులు చెల్లించకుండా కార్మికులను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారి హక్కులను కా లరాయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, స్కావెంజర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.