వాషింగ్టన్: అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ వాల్మార్ట్ (Walmart) హెచ్-1బీ వీసాదారులకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని నిర్ణయించింది. హెచ్-1బీ అభ్యర్థులు ఇక నుంచి దరఖాస్తు ఫీజుగా లక్ష డాలర్లు చెల్లించాంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త నిబంధన తెచ్చిన క్రమంలో వాల్మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్బర్గ్ ఓ కథనంలో తెలిపింది. భారత్, చైనా లాంటి నిఫుణులైన కార్మికులపై ఆధారపడ్డ టెక్ ఇండస్ట్రీపై ట్రంప్ నిర్ణయం ప్రభావం తీవ్రంగా పడింది.
వాల్మార్ట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రభావం పలువురు కార్పొరేట్ స్థాయి ఉద్యోగులపై కూడా పడుతుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. వినియోగదారులకు ఉత్తమసేవలు అందించడానికి ప్రతిభపై తాము పెట్టుబడి పెట్టడానికి నిబద్ధులమై ఉన్నామని వాల్మార్ట్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. తమ హెచ్-1బీ నియామక విధానం గురించి కంపెనీ ఆలోచిస్తున్నదని చెప్పారు. అమెరికాలోని రిటైల్ కంపెనీల్లో వాల్మార్టే అధికంగా హెచ్-1బీ వీసాలను వినియోగించుకుంది.