వాషింగ్టన్: ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ అమెరికన్లతో దీపావళి జరుపుకుంటున్నట్టు కన్పించినప్పటికీ, ఆయనకు మద్దతునిస్తున్న మాగా శిబిరం సభ్యులు మాత్రం హిందువులపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ దీపావళి సందర్భంగా ఒక రోజు క్రితం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
దీనిపై పలువురు అభ్యంతరకర కామెంట్లు చేశారు. ‘దీపావళి అమెరికన్లది కాదు, భారత దేశానికి వెళ్లిపోండి’ అని విద్వేషం వెళ్లగక్కారు. అలాగే గుజరాత్‌కు చెందిన ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌కు కూడా ఇలాంటి విద్వేషపూరిత కామెంట్లు ఎదురయ్యాయి. ‘అబద్ధ దేవుళ్ల ఆరాధన ఆపండి’, ‘పశ్చాత్తాప పడి రక్షణ కోసం ప్రభువైన ఏసుక్రీస్తును నమ్మండి’ అని పలువురు కామెంట్ చేశారు.