బంజారాహిల్స్, అక్టోబర్ 22 : రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎం రేవంత్ కనుసన్నల్లో నడుస్తోందని హెచ్వైసీ అభ్యర్థి సల్మాన్ ఆరోపించారు. బుధవారం సల్మాన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ప్రభుత్వం, రిటర్నింగ్ అధికారి తీరుపై మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నామినేషన్ల ప్రక్రియలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, 99 శాతం మంది అభ్యర్థిత్వాన్ని కావాలనే రద్దు చేశారని ఆరోపించారు. నా అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేశారో రాతపూర్వంగా ఇవ్వమని చెబితే కేవలం నోటి మాటకు చెబుతూ తన తప్పును దాటవేస్తున్నాడన్నారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందని, జూబ్లీహల్స్ నుంచే కాంగ్రెస్ పతనం మోదలవుతుందని జోస్యం చెప్పాడు. అనంతరం తన అనుచరులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశాడు. అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో రిటర్నింగ్ అధికారి అకారణంగా తన నామినేషన్‌ను తిరస్కరించారని సల్మాన్ ఖాన్ ఆరోపించారు. కొన్నినెలలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, రహ్మత్‌నగర్, షేక్‌పేట డివిజన్ల పరిధిలోని పలు బస్తీల్లో హెచ్వైసీ పేరుతో పలు కార్యక్రమాలు చేస్తున్న సల్మాన్‌ఖాన్‌కు మైనార్టీ వర్గాల్లో పట్టుందని, నవీన్ యాదవ్‌కు నష్టం తప్పదనే ఉద్దేశంతోనే ఆయన నామినేషన్ తిరస్కరించారంటూ నేతలు ఆరోపిస్తున్నారు.