కారేపల్లి, నవంబర్ 25 : పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనింగ్ రాజేశ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారులకు సహాయ రిటర్నింగ్ అధికారులు సహకరిస్తుంటారని, మండలంలో 13 క్లస్టర్లకు గాను 13 మంది రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల ప్రక్రియ, 41 గ్రామ పంచాయతీలకు 41 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. కాబట్టి వీరికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయిందని చెప్పారు.
ఈ శిక్షణలో భాగంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలపై పూర్తిస్థాయిలో మాస్టర్ ట్రైనీలు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సింగరేణి మండలంలో 45,411 మంది ఓటర్లు ఉండగా 356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మూడో విడుతలో మండలంలో ఎన్నికలు ఉండవచ్చని నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సమగ్ర వివరాలతో కూడిన సామగ్రిని రిటర్నింగ్ అధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ రమేశ్, ఎంఈఓ జయరాజ్, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ రమేశ్ పాల్గొన్నారు.

Karepally : పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్ఓలకు శిక్షణ