భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్భాటాలు తప్ప ఆచరణలో విఫలమవుతున్న కాంగ్రెస్ సర్కారు.. ఇంటర్ విద్యపై పట్టింపులేకుండా వ్యవహరిస్తోంది. మండలానికో మోడల్ స్కూల్ అని, నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ స్కూల్ అని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు.. భద్రాద్రి జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల సమస్యలను కూడా తీర్చలేకపోతోంది. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అంటూ ప్రారంభోత్సవ సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏజెన్సీ మండలాల్లో సర్కారు ఇంటర్మీడియట్ కాలేజీలు, వాటిల్లో పరీక్ష కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తోంది.
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుకోవాలనుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంటర్ విద్య అందని ద్రాక్షగా చేస్తోంది. ఫలితంగా పొరుగు మండలాల్లోని ప్రభుత్వ కాలేజీలకు కాలినడకనో, ప్రజా రవాణాలోనే రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్న విద్యార్థులు.. పట్టణ ప్రాంతాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు. ఇంటర్ విద్యను అన్ని మండలాలకు అందుబాటులోకి తీసుకొచ్చి బలోపేతం చేస్తే తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేద విద్యార్థులు అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చేస్తుందో చూడాలి మరి.
ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్యపై కాంగ్రెస్ సర్కారు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. భద్రాద్రి జిల్లాలో 22 మండలాలుండగా.. కేవలం 14 మండలాల్లోనే ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ కాలేజీలు లేని మండలాల పేద విద్యార్థులు పొరుగు మండలాల్లోని ప్రభుత్వ కాలేజీలకు రోజూ రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను భరించైనా సరే ప్రైవేటు కళాశాలలకు పంపుతున్నారు. దీంతో ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు 4,150 మంది ఉండగా.. ప్రైవేటు కాలేజీల్లో 9,877 మంది చదువుతుండడం గమనార్హం.
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలే లేవు. దీంతో విద్యార్థులు పొరుగు మండలాల్లోని ప్రభుత్వ కాలేజీలకు నిత్యం రాకపోకలు సాగిస్తూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే, ఈ మండలాల్లో కాలేజీలు లేనందున పరీక్ష కేంద్రాలు కూడా పొరుగు మండలాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అయితే, అసలే గ్రామీణ మండలాలు కావడంతో పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా బస్సులు వచ్చే సమయం, విద్యార్థులు వెళ్లే సమయంలో అనుకూలంగా లేకపోవడంతో చివరికి ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది.
భద్రాద్రి జిల్లాలో సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ఆళ్లపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, కరకగూడెం మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు. కానీ, ఈ మండలాల్లో కొన్నిచోట్ల సోషల్ వెల్ఫేర్, ట్రైబుల్ వెల్ఫేర్, గురుకులాల కాలేజీలు ఉన్నాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం ఈ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. ఒకవేళ కొన్ని గురుకులాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినా అవి మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నాయి. అక్కడి విద్యార్థులు బయటి పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయాలన్నా, లేదంటే ఇతర ప్రాంతాల విద్యార్థులు ఈ కాలేజీలకు వచ్చి పరీక్షలు రాయాలన్నా ఆటోలు, బస్సులు ఎక్కి పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
ఒక్కోసారి బస్సులో, ఆటోలో ఆలస్యమైతే దాని ప్రభావం పరీక్షలపై పడుతోంది. ఇక దూరాభారాలను పరిశీలిస్తే.. దమ్మపేట మండలంలో సోషల్ వెల్ఫేర్ కాలేజీలు రెండు, ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ ఒకటి ఉన్నాయి. కానీ, ఈ మూడు కాలేజీల్లోనూ ఇంటర్ పరీక్షలకు ఎగ్జామ్ సెంటర్ లేదు. దీంతో ఈ మండలాలల విద్యార్థులందరూ అశ్వారావుపేట వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఆళ్లపల్లి మండలంలో అసలు ప్రభుత్వ కాలేజీయే లేకపోవడంతో అక్కడి నుంచి విద్యార్థులు పినపాక మండలానికి వచ్చి చదువుకోవాల్సి వస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఈ మండలం నుంచి పినపాకకు రాకపోకలు సాగించలేక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వరంగల్లోని ప్రైవేటు హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు.
మా మండలంలో ప్రభుత్వ కాలేజీ లేదు. నేను పినపాక మండలంలో ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాను. దూరం వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ, చదువును మధ్యలో ఆపలేక ప్రైవేటుకు వెళ్తున్నాను. లేకపోతే వరంగల్ వెళ్లాలి. మా మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తే మాకు ఎంతో మేలు జరుగుతుంది.
-పర్మిక మేఘన, ఇంటర్ విద్యార్థిని, కరకగూడెం
లోకల్లో ప్రభుత్వ కాలేజీ లేక, రోజూ రాకపోకల ఇబ్బందులు పడలేక మా పాపను వరంగల్లో చదివిస్తున్నాను. ప్రభుత్వాలు ఏం చేసినా.. చెయ్యక పోయినా చదువు పట్ల దృష్టిపెట్టాలి కదా. దూరం వెళ్లి చదువుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పనే. అయినా తప్పడం లేదు.
-ముత్యాల మధు, కరకగూడెం, ఇంటర్ విద్యార్థిని తండ్రి
ప్రస్తుతం కాలేజీలు లేని మండలాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాం. లక్ష్మీదేవిపల్లి మండలానికి కొత్తగూడెం జూనియర్ కాలేజీ అందుబాటులో ఉంది. కొన్ని మండలాల్లో సంక్షేమ కాలేజీలు ఉన్నాయి. కానీ, వాటిల్లో పరీక్ష కేంద్రాలు లేని మాట వాస్తవమే. వాటి కోసం ఉన్నతాధికారులతో చర్చించి పరీక్షా కేంద్రాలు వచ్చే ఏర్పాటు చేస్తాం.
-వెంకటేశ్వరరావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి, భద్రాద్రి