హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో ఎస్ శ్రీనివాస్, కే గుణశేఖర్, డీ సునీత ఉన్నారు.
కుల విద్వేషకులపై చర్యలు తీసుకోవాలి.. ఈబీసీ సంక్షేమ సంఘం జేఏసీ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కులాల పేరిట సమాజంలో విద్వేషాలను రేపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈబీసీ సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి జేఏసీ ఆధ్వర్యంలోని 18 కుల సంఘాలతో కలిసి ఫిర్యాదు చేశారు.
ఇతర కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా విద్వేషపూరిత ప్రసంగాలతో కులాల మధ్య చిచ్చుపెట్టేలా, ఘర్షణలు చెలరేగేలా కొందరు వ్యవహరిస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీలను దూషించినప్పుడు కేసు పెట్టినట్టే, ఇతర కులాలను దూషించినా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.