హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా, మహేశ్వ రం మండలం, నాగారంలోని భూదాన్ భూములను ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేశారనే అభియోగాల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. భూదాన్భూముల్లో రికార్డులు మార్చారన్న ఆరోపణలు, కుట్రపూరిత చర్యలపై ఈడీ లేఖ రాసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ దస్తగిరి షరీఫ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారించారు. మహేశ్వరం డీసీపీకి ఈడీ 2024 ఫిబ్రవరిలో లేఖ రాసినప్పటికీ చర్యలు లేవని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. తప్పుడు పత్రాలతో, ఫోర్జరీలతో, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీసీపీని ఈడీ కోరినా ఫలితం లేదని తెలిపారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.