సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తోనే హైదరాబాద్‌కు అన్ని విధాల రక్షణ అని..హైడ్రా తదితర సంస్థల ద్వారా పట్టి పీడిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాకొద్దంటూ జుబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు తిరుగుతున్నా.. సామాన్య ప్రజలు వారిని కలువకకుండా ముఖం చాటేస్తున్నారని ఆ పార్టీలోనే నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పదేండ్ల గులాబీ పాలనలో హైదరాబాద్ సురక్షితంగా ఉండేదని.. నేడు హైదరాబాద్‌లో ఏ ఒక్క మంచి పనికూడా జరగడం లేదని.. ఎటుచూసినా రోడ్లన్నీ గుంతలమయం.. దోమల బెడద.. కరెంట్ కోతలు ఇలా ఏది చూసినా అన్నీ సమస్యలే ఉంటున్నాయని వాటిని పరిష్కరించేందుకు బాధ్యతగా ఎవరూ సరిగ్గా ముందుకు రావడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో ఇంకెంత ఆధ్వాన్నమైన పరిస్థితులున్నాయంటూ జుబ్లీహిల్స్‌లో ఎక్కడ చూసిన సామాన్య ప్రజలలో చర్చ జరుగుతోంది.
పదేండ్లు రక్షణ కవచంలా బీఆర్ఎస్..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నగరం సురక్షితంగా ఉండేదని.. మహానగరానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాల రక్షణ కవచంగా ఉంటూ సామాన్యులకు అండగా నిలిచిందని, జుబ్లీహిల్స్‌లో అభివృద్ధ్ది జరిగిందంటే బీఆర్ఎస్ హయంలో జరిగిందంటూ ప్రజలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ కనీసం రోడ్లపై ఉన్న గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితిలో ఉందని, ఇప్పుడు మేం అభివృద్ధ్ది చేశామంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ బస్తీలు, కాలనీలలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్న కాంగ్రెస్ నేతలు సామాన్య ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు.. కనీసం ఆ ప్రయత్నం కూడా జరుగలేదు… ఓటెయ్యమంటూ ప్రజల వద్దకు వెళ్లాలంటేనే ఎలా అని నేతలు మదనపడుతున్నట్లు సమాచారం.
డైలమాలో కాంగ్రెస్ నేతలు..
ప్రచారానికి వెళ్లిన సమయంలో కొందరు ముఖం మీదనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టుతుండటంతో నేతలకు ఏమీ అర్ధం కాని పరిస్థితి ఎదురవుతోంది. భద్రతను గాలికి వదలేయడంతో మహిళలు రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి.. కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందంటూ విమర్శలున్నాయి. ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చి ఏమి చేస్తారు.. ఏ మూలన చూసిన జుబ్లీహిల్స్ అభివృద్ధ్ది బీఆర్ఎస్తోనే జరిగిందని, ఉప ఎన్నికలో పరాభవం తప్పదని స్థానిక నేతలు మథనపడుతున్నట్లు టాక్. బీఆర్ఎస్ హయంలో మాగంటి గోపినాథ్ జుబ్లీహిల్స్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని క్షేత్ర స్థాయిలో ప్రజలు తమ మనోగతాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నమ్మం కాక నమ్మం…!
కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని.. ఇప్పుడు వచ్చి మరోసారి నమ్మలేని హామీలించి మోసం చేసేందుకు చూస్తోందని జూబ్లీహిల్స్ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. గుడ్డిగా నమ్మి రాష్ట్ర ప్రజలు ఒకసారి మోసపోయారని, ఇక మనకు బీఆర్ఎస్తోనే శ్రీరామ రక్ష అనే విషయాన్ని సైతం ఆయా కూడళ్లలో చర్చించుకుంటున్నారు. సామాన్య ప్రజలు చర్చించుకుంటున్న అంశాలను తెలుసుకుంటున్న కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్లు మాట్లాడుకుంటున్న విషయాలలో ఖండించేవేమి లేవని, అందుకే సామాన్యులకు సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నామంటూ తమ నిస్సాయతను వ్యక్తం చేస్తున్నారని జుబ్లీహిల్స్‌లో రాజకీయ పరమైన చర్చలు జరుగుతున్నాయి.