సూర్యాపేట, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డ్రా తీశారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకంగా లాటరీ నిర్వహించామన్నారు. 2025-27 సంవత్సరాలకు సంబంధించి 93 దుకాణాలు ఉండగా వాటిలో 27 గౌడ కులస్తులకు కేటాయించగా ఎస్సీలకు 10, ఎస్టీలకు 3 షాపులు రిజర్వేషన్ ప్రకారం కేటాయించామన్నారు. డ్రా ద్వారా షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన లైసెన్స్‌లతో దుకాణాలు నిర్వహించుకోవచ్చని, అలాగే నిబంధనల మేరకు నడపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు లక్ష్మా నాయక్, ఎక్సైజ్ సీఐలు మల్లయ్య, శంకర్, నాగార్జున్‌రెడ్డి, రజిత, స్టీఫెన్సన్, ఐఎస్‌లు సిబ్బంది పాల్గొన్నారు.
రూ.3.20 కోట్లు పెడితే ఒక్కటీ రాలేదు..!
మద్యం షాపులను దక్కించుకునేందుకు కొంతమంది కలిసి 108 టెం డర్లు వేస్తే కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. దీంతో టెండర్లు వేసి డ్రా సందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేయ డం కనిపించింది. కోదాడ ప్రాంతానికి చెందిన కొంతమంది కలిసి జిల్లా వ్యాప్తంగా సుమారు 35షాపులకు టెండర్ వేశారు. ఒక్కో టెండర్‌తోపాటు 3 లక్షల నాన్ రిఫండబుల్ పద్ధ్దతిన మొత్తం రూ.3.20 కోట్లు వెచ్చించినా ఒక్క షాపు రాకపోవడంపై నిట్టూర్చుతూ వెళ్లిపోయారు.
భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

మద్యం షాపులకు సోమవారం తీసిన డ్రాలో పట్టణానికి చెందిన ఓ జంటను ఆదృష్టం వరించింది. ఎలికట్టి భరత్, శ్రావణి దంపతులు జిల్లా కేంద్రంలోని మూడు షాపులకు రెండు చొప్పున మొత్తం ఆరు టెం డర్లు వేయగా డ్రాలో ఇద్దరి కీ చెరో దుకాణం దక్కింది. దుకాణం నంబర్ 21కి 30 టెండర్లు దాఖలు కాగా అదృష్టం భరత్‌ను వరించగా, ఆయన భార్య శ్రావణికి 27 టెండర్లు దాఖలు చేసిన 13వ నంబర్ దుకాణం దక్కింది. పదుల సంఖ్యలో సిండికేట్‌గా ఏర్పడి టెండర్లు వేస్తే, ఏదో ఒకటి దక్కకపోతుందా అని టెండర్ల లో పాల్గొన్న చాలా మందిని అదృష్టం వరించకపోగా రెండు దుకాణాలు దక్కించుకున్న భరత్, శ్రావణి దంపతులు అదృష్టవంతులే.