హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సహా పలు ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులపై సర్కారు నాన్చుడుధోరణి అవలంబిస్తున్నది. ఎంత ఫీజు అనేది తేల్చడం లేదు. ఫీజుల ఖరారు కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)భేటీలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి వాయిదాపడగా, తాజాగా సోమవారం జరగాల్సిన భేటీ కూడా వాయిదాపడింది. టీఏఎఫ్ఆర్సీ కార్యదర్శి యోగితారాణా నవంబర్ 1 నుంచి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లనున్నారు. ఈ నెలాఖరులోగా టీఏఎఫ్ఆర్సీ ఫీజులను ఆమోదిస్తేనే ఫీజులు ఖరారవుతాయి. లేదంటే ఫీజుల ఖరారుకు బ్రేక్ పడ్డట్టే. 2025-28 మూడేండ్ల బ్లాక్ పీరియడ్‌కు, ఫీజుల సవరణకు టీఏఎఫ్ఆర్సీ కసరత్తు పూర్తిచేసింది.
పలు కాలేజీల్లో కోర్సుల వారీగా ఫీజులు ఖరారు చేయగా సర్కారు అభ్యంతరం వ్యక్తంచేసింది. ఫీజులను భారీగా పెంచారంటూ మెలికపెట్టింది. ఫీజుల ఖరారుకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. దీంతో కాలేజీల వారీగా ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ పునర్విచారించి ఫీజులను ఖరారుచేసింది. ఈ ఫీజులను తొలుత టీఏఎఫ్ఆర్సీ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదించి జీవో జారీచేస్తుంది. కానీ, టీఏఎఫ్ఆర్సీ ఫీజులను ఆమోదించేందుకు నిర్వహించాల్సిన సమావేశాలు మాత్రం వాయిదాపడుతూ వస్తున్నాయి. ఫీజులు ఖరారు చేయకపోవడంతో విద్యార్థులపై ఎంతభారం పడుతుంది. అదనంగా ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది తెలియని పరిస్థితి. అయితే, అకాస్మాత్తుగా భారం మోపితే ఫీజు కట్టేది ఎలా? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.