Thieves | ఘట్కేసర్, ఏప్రిల్ 21: దొంగలు ఆరు ఇళ్లలో ఇంటి తాళాలు పగుల గొట్టి నగలు, నగదు దోచుకుపోయిన సంఘటన ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి అవుషాపూర్‌లోని జగత్ స్వప్న గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం జరిగింది. ఘట్ కేసర్ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్ కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి అవుషాపూర్‌లోని జగత్ స్వప్న గేటెడ్ కమ్యూనిటీలో 6 ఇళ్ల తాళాలు పగులగొట్టి నగలు, నగదు దోచుకుపాయారు.
గేటెడ్ కమ్యూనిటీ లో నివాసం ఉంటున్న రాజేంద్రప్రసాద్, రవీందర్, అనంతన్, అంజలి, థామస్, శైలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఊళ్లకు వెళ్లారు. అదే అదునుగా భావించిన గుర్తు తెలియని దొంగలు ఆరు ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువాలలోని విలువైన వస్తువులను దొంగిలించుకుపోయారు.
గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ సోలాల్ ఫెన్సింగ్ ఉన్నప్పటికీ దొంగలు వెనుకాల ఉన్న గోడ ద్వారా లోనికి ప్రవేశించి యధేచ్చగా చోరికి పాల్పడ్డారు. ఆరు ఇళ్ల యాజమానులలో ఒక్క దుర్గ ప్రసాద్ మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆయన ఇంట్లో నుండి 1.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు చోరీకి గురయినట్లు తెలిసింది. మిగతా అయిదుగురు అందుబాటులో లేక పోవటంతో చోరీకి గురైన వస్తువులు, నగదు విలువ తెలియరాలేదు.
క్లూస్ టీంతో ఆధారాలు సేకరణ..
జగత్ స్వప్న గేటెడ్ కమ్యూనిటీలో తాళాలు పగులగొట్టి చోరి జరిపిన ఆరు ఇళ్లను మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పరశురాం, అడిషనల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ జ్ఞానేందర్ రెడ్డి, ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. దొంగతనానికి పాల్పడిన దొంగలను పట్టుకుంటామని ఏసీపీ చక్రపాణి తెలిపారు.
భయాందోళనలకు గురవుతున్న స్థానికులు..
జగత్ స్వప్న గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ సోలార్ ఫెన్సింగ్‌తోపాటు వాచ్ మెన్ కాపలా ఉన్నప్పటికి దొంగతనం జరగటం పట్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్నప్పటికి దొంగతనం జరగటం పట్ల పోలీసుల వైఫల్యాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. వారం రోజులకు ఒక్కసారి తప్పనిసరిగా దొంగలు పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.
తాళం వేసి ఉంటే చాలు దొంగలు చేతివాటం చూపుతూనే ఉన్నా వారిని పట్టుకోవటంలో పోలీసులు విఫలం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గస్తీ పెంచి దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస దొంగగతనాలు జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం